Jul 10,2022 23:09

స్థల వివాదంలో కత్తులతో దాడి
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌:
స్థలవివాదంలో కత్తులతో దాడి చేసుకుని పలువురు గాయపడ్డారు. ఈ సంఘటన చిత్తూరు కార్పొరేషన్‌ పరిధిలోని మూడో గేటు వద్ద ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు చిత్తూరు కార్పొరేషన్‌ పరిధిలోని మూడవ గేటు వద్ద ఆంజనేయస్వామి ట్రస్టు చైర్మన్‌ మురుగయ్య గత 20 సంవత్సరాలుగా ఆంజనేయ స్వామి గుడిని నిర్మించి సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నాడు. ఆస్థలంలో ఇదే గ్రామానికి చెందిన కొందరు ఎలాగైనా ఆక్రమించుకోవాలని పలు దఫాలు ప్రయత్నించి విఫలమయ్యారు. ఆదివారం అయ్యప్ప స్వామి గుడి నిర్మించేందుకు ప్రయత్నిస్తూ స్థలాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. దీనిన మురగయ్య, వారి కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో స్థలాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నా వ్యక్తులు మురుగయ్య, అతడి భార్య లక్ష్మమ్మ పై కత్తులతో దాడి చేసి గాయపరిచారు. ఈసంఘటనలో గాయపడ్డ మురుగయ్య దంపతులను చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి గ్రామస్తులు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మూడో గేటుకు చెందిన గోపితో పాటు నలుగురు వ్యక్తులు దాడి చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.
దౌర్జన్యం చేసిన వారిని అరెస్టు చేయాలి: సిపిఎం
మురగయ్య కుటుంబానికి రక్షణ కల్పించాలి
చిత్తూరు మూడో గేట్‌ చెరువు ముందరపల్లికి చెందిన మురగయ్యపై ఐదుగురు రౌడీలు విశిక్షణారతంగా దౌర్జన్యం చేయడం దారుణమని, వారిని వెంటనే అరెస్టు చేసి మురగయ్యను, అతని కుటుంబానికి రక్షణ కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్‌ చేశారు. ఆయన మాట్లాడుతూ గుడి స్థలాన్ని ఎలాగైనా ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేయడం దారుణమన్నారు. గత20 సంవత్సరాలుగా ట్రస్ట్‌ పేరుతో ఆలయాన్ని నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న వారిపై దాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు. వేరే గుడికి దారి ఇవ్వాలని అడిగితే దారి ఇస్తామని చెప్పినా ఆ సాకుతో స్థలాన్ని కాజేయడానికి ప్రయత్నం చేశారని, మురగయ్య ఒప్పుకోకపోవడంతో వారిపై ఆయుధాలతో దాడి చేసి చంపడానికి పూనుకున్నారని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా గ్రామాల్లో ప్రశాంతత వాతావరణం తీసుకురావడానికి దౌర్జన్యం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.