
* సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: కొల్లి సత్యం మాస్టారు ఆశయసాధనకు కృషి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో సత్యం మాస్టారు సంతాప సభను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్బంధాలను ఎదిరించి ప్రజా సమస్యలపై పోరాడిన యోధుడని కొనియాడారు. ఆరేళ్ల పాటు జైలు జీవితాన్ని అనుభవించారని, ఎమర్జెన్సీ కాలంలో 19 నెలలు జైల్లో ఉన్నారని తెలిపారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా చివరి వరకు పార్టీ అభివృద్ధి కోసం పాటుపడ్డారని కొనియాడారు. సత్యం మాస్టారు మందస, సోంపేట ప్రాంతాల్లో కార్మిక, రైతాంగ ఉద్యమాలు నిర్మించారని గుర్తుచేశారు. ఈనెల 18న సత్యం మాస్టారు సంతాప సభను మందసలో నిర్వహించనున్నట్లు తెలిపారు. తొలుత సత్యం మాస్టారు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.మోహనరావు, సీనియర్ నాయకులు వి.జి.కె మూర్తి, కె.శ్రీనివాసు, కె.అప్పారావు, బి.మోహనరావు, పి.తేజేశ్వరరావు, టి.తిరుపతిరావు, గోవర్థన్, వెంకట్రావు పాణిగ్రాహి, శ్రీదేవి, పి.కామినాయుడు, ఎ.సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.