
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్: త్యాగాల పునాదులపైన నిర్మించిన విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రయివేటుపరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం, ఉత్తరాంధ్రను ఏకంగా ఇతరులకు అమ్మకానికి పెట్టడమేనని వివిధ పార్టీల, ప్రజా సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలోని క్రాంతి భవన్‌లో శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వైసిపి, కాంగ్రెస్, బిజెపి మినహా అన్ని పార్టీలు, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 32 మంది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో జరిగిన ఉద్యమంలో ప్రాణాల కోల్పోయారని చెప్పారు. కాంగ్రెసు మినహా, దాదాపు అన్ని పార్టీల వారు చట్టసభల పదవులకు రాజీనామా చేశారని గుర్తు చేశారు. వేలాదిమంది ఇళ్లను, భూములను స్టీల్ ప్లాంట్‌కు స్వచ్ఛందంగా అప్పగించారని చెప్పారు. బలిదానాలకు, త్యాగాలకు విలువ ఇవ్వకుండా మోడీ ప్రభుత్వం తన కొమ్ము కాసే కార్పొరేట్ కంపెనీల కోసం స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ప్రయత్నించడం జాతి ప్రయోజనాలను బలి తీసుకోవడమేనని విమర్శించారు. అఖిలభారత యువజన సమాఖ్య, శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ, సిపిఐ జిల్లా కార్యదర్శి బలగ శ్రీరామ్మూర్తి, అరసం జిల్లా అధ్యక్షులు నల్లి ధర్మారావు, రైతు సంఘం నాయకులు బుడితి అప్పలనాయుడు పాల్గొన్నారు.