
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: న్యాయవాదుల సంక్షేమ స్టాంపు నిధి రుసుము పెంపును ఉపసంహరించుకోవాలని బార్ అసోసియేషన్ ప్రతినిధులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. నగరంలోని జిల్లా బార్ అసోసియేషన్ సమావేశ మందిరంలో జిల్లాలోని పలు బార్ అసోసియేషన్ల అధ్యక్ష, కార్యదర్శులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ని సూర్యారావు మాట్లాడుతూ సంక్షేమ నిధి పేరిట స్టాంపు రుసుము పెంపు సరికాదన్నారు. న్యాయవాదులకు ఆపద సమయంలో ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.నాలుగు లక్షల సాయాన్ని రూ.20 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తాన్ని పెంచకుండా ఒక్క సంక్షేమ నిధి స్టాంపు రుసుము పెంపు సరికాదన్నారు. దీన్ని నిరసిస్తూ న్యాయవాదులు విధులు బహిష్కరించి ఉద్యమాలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ లావాదేవీలను ఎప్పటికప్పుడు జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులకు తెలపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు గేదెల వాసుదేవరావు మాట్లాడుతూ బార్ అసోసియేషన్ల డిమాండ్లు, సూచనలను ఈనెల 21న నిర్వహించనున్న రాష్ట్ర బార్ కౌన్సిల్ సమావేశంలో చర్చిస్తానన్నారు. సమావేశంలో టెక్కలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు వివేకానంద, కోటబొమ్మాళి అధ్యక్షులు డి.నర్సింహమూర్తి, ఆమదాలవలస అధ్యక్షులు కె.విజయలక్ష్మి, పాలకొండ అధ్యక్షులు టి.సత్యంనాయుడు, రాజాం కార్యదర్శి రవి, శ్రీకాకుళం బార్ అసోసియేషన్ ప్రతినిధులు పొన్నాడ రాము, గంగుల భాస్కరరావు, హరిప్రియ తదితరులు పాల్గొన్నారు.