ప్రజాశక్తి -తిరుపతి టౌన్: తిరుపతి నగరాభివద్ధికి చేయాల్సిన పనులపై చర్చించి ఆమోదించినట్లు తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీషా తెలిపారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ సమావేశం మంగళవారం మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ డాక్టర్ శిరీషా, కమిషనర్ పి.ఎస్.గిరీషా నిర్వహణలో, స్టాండింగ్ కమిటీ సభ్యులు, డిప్యూటీ మేయర్లు భూమన అభినరు రెడ్డి, ముద్ర నారాయణ, ఎస్.కె.బాబు, ఉమాఅజరు, నరసింహాచారి, అదనపు కమిషనర్ హరితల సమక్షంలో జరిగింది. కమిషనర్ గిరీషా అజెండా అంశాలను సమావేశంలో ప్రవేశపెట్టి వివరించారు. సభ్యుల ఆమోదానికి వుంచగా, ఏకగ్రీవంగా ఆమోదించారు.
మేయర్ డాక్టర్ శిరీషా మాట్లాడుతూ కార్మికులకు ప్రాధాన్యత నగరపాలక సంస్థలో పనిచేస్తున్న అండర్ డ్రైనేజి, మురికినీరు శుద్ది చేసే కార్మికులకు, వాటర్ ట్యాంక్ డ్రైవర్లకు అవసరమైన గెడ్డపారలు, పారలు, మోటర్ రోప్స్, కొడవళ్ళు, కత్తులు, టార్చ్ లైట్స్, యూనిఫాం, రైన్ కోట్స్ ఇచ్చేందుకు రూ.13 లక్షల 85 వేలను ఆమోదిస్తూ కమిటీ తీర్మానం చేసిందన్నారు. ఎమ్మార్‌పల్లెలోని డివిజనల్ పంచాయతి కార్యాలయానికి సంబంధించిన కొంత స్థలాన్ని నగరపాలక సంస్థకు ఇవ్వడంతో, సదరు డివిజనల్ పంచాయతి కార్యాలయ భవన నిర్మాణానికి నగరపాలక సంస్థ నుండి రూ.10 లక్షలు ఇవ్వాలన్నారు. అదేవిధంగా ముత్యాలరెడ్డిపల్లె ఏరియాల్లో పూర్తి చేసిన సిమెంట్ రోడ్లకు అయిన ఖర్చులను ఆమోదిస్తూ తీర్మానం చేయడం జరిగిందన్నారు. మధురానగర్ ఏరియాలో సిమెంట్ రోడ్డు, యూజిడి పైప్‌లైన్ ఏర్పాటుకు, మరికొన్ని ఏరియాల్లో రోడ్ల నిర్మాణాలకు, పైపు లైన్ల ఏర్పాటుకు, అదేవిధంగ శివజ్యోతినగర్‌లోని బధిర వసతి గహానికి అవసరమైన పనులు చేయుటకు రూ.5 లక్షలు మంజూరు చేయడం జరిగిందని మేయర్ శిరీషా తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ తిరుమాలిక మోహన్, మునిసిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, లోకేష్ వర్మ, కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, అమరనాధ్ రెడ్డి పాల్గొన్నారు.










