మాట్లాడుతున్న సిపిఎం నాయకులు
సర్వేయర్‌పై చర్యలు తీసుకోవాలి
సిపిఎం నేతల డిమాండ్
ప్రజాశక్తి-ఇందుకూరుపేట:అవినీతికి పాల్పడుతూ అక్రమ సర్వే రిపోర్ట్‌లు ఇస్తున్నా మైపాడు గ్రామానికి చెందిన సర్వేయర్ తుమ్మల విజరు కుమార్ పై ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఇందుకూరుపేట సిపిఎం మండల కార్యదర్శి మైపాటి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం తహశీల్దార్ సుబ్బయ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి మైపాటి కోటేశ్వరరావు మాట్లాడుతూ గతంలో సర్వేయర్ తుమ్మల విజరు కుమార్ సొంత గ్రామమైన మైపాడులో పనిచేస్తూ అనేక అక్రమాలకు పాల్పడడంతో అనేక ఫిర్యాదులు తమకు అందాయని, సదరు సర్వేయర్ ఆగస్టు 28వ తేదీన నెల్లూరు కలెక్టరేట్ లోని డిపిసి సెంటర్‌కు డిప్యూటేషన్ పై వెళ్లినా కూడా సదరు సర్వేయర్ ఇప్పటికీ మైపాడులో అక్రమంగా సర్వే రిపోర్టులు ఇస్తూ పలు దొంగ రిజిస్ట్రేషన్ లకు పాల్పడుతున్నారన్నారు. ఉదాహరణకు ఈనెల 9వ తేదీ నారపరెడ్డి కామేశ్వరమ్మ సన్నాఫ్ బలరామిరెడ్డి ఇంటి రిజిస్ట్రేషన్‌కు అక్రమ సర్వే రిపోర్టును ఇచ్చారన్నారు. అధికారులు స్పందించి తప్పుడు సర్వే రిపోర్ట్ ఇస్తున్న సదరు సర్వేయర్ పై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో సదరు సర్వేయర్ పై పలు ఫిర్యాదులు ఉన్నాయని వాటన్నిటిని పరిగణంలోకి తీసుకొని అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో డివైఎఫ్ మండల అధ్యక్షుడు చీమకుర్తి శ్రీనివాసులురెడ్డి, సిపిఎం నేతలు పాల్గొన్నారు.
ఇదే విషయమై మండల సర్వేయర్ హరినాథ్ రెడ్డిని వివరణ కోరగా సదరు సర్వేయర్ తుమ్మల విజరు కుమార్ ఆగస్టు 28వ తేదీన డిప్యూటేషన్ పై కలెక్టరేట్ లోని డిపిసి సెంటర్ కు వెళ్లడం జరిగిందని తెలిపారు. మైపాడులోని ఒకటి, రెండు సచివాలయాలకు ,ప్రస్తుతం సర్వేయర్ సమీర్ విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.










