Apr 08,2023 22:39

విలేకరులతో మాట్లాడుతున్న పరిటాల శ్రీరామ్‌

          అనంతపురం కలెక్టరేట్‌ : ధర్మవరం చెరువుకు అనుకుని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గుర్రాల కోట నిర్మించుకున్న భూమి కొనుగోలు చేసిందా..? ఆక్రమించుకున్నదా.? అన్నది నిజాయితీగా సర్వే చేయిస్తే తెలుస్తుందని టిడిపి ధర్మవరం నియోజకవర్గం ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌ పేర్కొన్నారు. శనివారం ఉదయం అనంతపురం నగరం అరవింద నగర్‌లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి భూ ఆక్రమణపై తాము ఆధారాలతో సహా వాస్తవాలు వెల్లడించామన్నారు. దీనిని జీర్ణించుకోలేక యువగళం పాదయాత్ర, యువనేత నారా లోకేష్‌ నడకపై వ్యగ్యంగా విమర్శలు చేయడం హస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి అక్రమాలను ఎండగట్టేందుకే నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. ధర్మవరం జరుగుతున్న అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు కేతిరెడ్డి ఇలా నీచరాజకీయాలు చేస్తున్నారని చెప్పారు. గుర్రాలకోటలో మ్యాప్‌ ప్రకారం భూమి ఉన్నట్లయితే మిగతా భూమి ఎవరిదో అన్న విషయమైన ప్రజలకు తెలపాలన్నారు. బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉన్న ఆయన వాస్తవాలను ప్రజలకు తెలియజేసి నిజాయతీని నిరూపించుకోవాలన్నారు. ఆక్రమిత భూమి జి.సూర్యనారాయణ, అలియాస్‌ మేడాపురం సూరి అనే వ్యక్తిది అంటున్నారని, సదరు సూరి అనే వ్యక్తి ఎమ్మెల్యేకు అత్యంత ఆప్తుడన్న విషయం ధర్మవరం నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసన్నారు. బస్టాంట్‌ దగ్గర బ్రాహ్మణుల భూమి వివాదంలో మేడాపురం సూరి ఉన్నది నిజం కాదా అన్నారు. అక్రమాలు చేశారంటూ ప్రశ్నించిన వారిపై లేనిపోని అవాకులు, చవాకులు చేస్తే సహించేది లేదన్నారు. తాను ధర్మవరం వస్తే హింస, హత్యలు, దాడులు పెరుగుతాయని, కత్తులు, బాంబుల సంస్కృతి పునరావృతం అవుతుందంటూ కేతిరెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. రాప్తాడులోనూ ఇదే పంతాతో తమపై ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా పరిటాల కుటుంబం అంటే జిల్లా ప్రజలు అందరికీ తెలుసుకున్నారు. అక్రమాలకు పాల్పడిన వారికి ప్రజాక్షేత్రంలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు.