ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు భూ సమస్యల నుంచి పరిష్కరించే దిశగా రీ సర్వే చేపట్టిందని, ఈ కార్యక్రమానికి ప్రజలు సహకరించి ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ అన్నారు. శుక్రవారం కుప్పం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో జరుగుతున్న రీసర్వే పరిశీలించారు. రామకుప్పం మండలంలోని విజలాపురం, కుప్పం మండలంలోని పెద్దిగాని ఊరు, గుడిపల్లి మండలంలోని ఉన్నిగానిపల్లి, సోనిసిగానిపల్లి గ్రామాల్లో రీ సర్వే పరిశీలించారు. డ్రోన్ సర్వే తరువాత ఒఆర్‌ఐ సీట్లు ద్వారా వచ్చిన వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం, గ్రౌండ్ ట్రూథింగ్ ప్రధాన లక్ష్యమని అన్నారు. క్షేత్రస్థాయిలో భూమి కొలతల విషయంలో ఏవైనా అబ్యంతరాలు ఉంటే డిటి స్థాయి అధికారి ఉంటారని, వారి ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చని అన్నారు. 110 సంవత్సరాల తర్వాత నిర్వహించబడుతున్న ఈ సర్వే రెవెన్యూ శాఖకు ఎంతో అవసరం ఉంటుందని పూర్తిస్థాయిలో ఈ సర్వే ద్వారా శిక్షణ పొందిన వారు రానున్న రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధిగమించగలర న్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించడంతో పాటు సర్వే కి సంబంధించిన సర్వే రాళ్లను నూతనంగా పాతడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ శివయ్య పాల్గొన్నారు.










