Jul 14,2023 18:50

ప్రజాశక్తి - భీమవరం రూరల్‌
ప్రజలకు సరసమైన ధరలకు నాణ్యమైన బియ్యం అందజేతే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. శుక్రవారం స్థానిక రైతు బజార్‌ వద్ద జిల్లా యంత్రాంగం నిర్దేశించిన రేట్లకే నాణ్యమైన బియ్యం అమ్మకానికి ఏర్పాటు చేసిన స్టోర్‌ను జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రామ్‌సుందర్‌ రెడ్డి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బహిరంగ మార్కెట్లో బియ్యం రేట్లను నియంత్రించేందుకు సివిల్‌ సప్లరు అధికారులు, ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌, హోల్‌ సేల్‌ బియ్యం వ్యాపారులు సమన్వయంతో ప్రభుత్వ స్టోర్‌లో బియ్యం అమ్మకాలను ప్రారంభించినట్లు తెలిపారు. బహిరంగ మార్కెట్లో ధరకు ప్రభుత్వ స్టోర్‌ ధరకు పది రూపాయల వరకూ వ్యత్యాసం ఉందన్నారు. బహిరంగ మార్కెట్లో సాధారణ రకం రూ.42, ఫైన్‌ రకం రూ.45, సూపర్‌ ఫైన్‌ రకం రూ.55 ఉండగా, ప్రభుత్వ స్టోర్‌లో వరుసగా రూ.34, రూ.40, రూ.46 ధరలు నిర్ణయించి అమ్మకాలు చేపట్టినట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలన్నారు. జెసి మాట్లాడుతూ తణుకు, తాడేపల్లిగూడెం, ఆకివీడు పట్టణాల్లో ఈనెల 15వ తేదీన బియ్యం స్టోర్లు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్‌ సప్లయీస్‌ జిల్లా మేనేజర్‌ టి.శివరామ ప్రసాద్‌, డిఎస్‌ఒ ఎన్‌.సరోజ, మెప్మా పీడీి గ్రంధి పార్వతి, హార్టికల్చర్‌ ఎడి దుర్గేష్‌, మార్కెటింగ్‌ ఎడి కె.సునీల్‌ కుమార్‌ పాల్గొన్నారు.