May 16,2023 21:37

మండల మీట్‌లో మాట్లాడుతున్న సభ్యులు

        ప్రజాశక్తి-నార్పల   మండల పరిధిలోని సిద్ధరాచెర్ల సర్పంచి రామాంజినేయులుపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మండల సభలో పలువురు సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంపిడిఒ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముందుగా సర్పంచిపై దాడిని తీవ్రంగా పరిగణించకపోతే ప్రజాప్రతినిధులు ప్రజల్లో తిరగలేరని జడ్పీటీసీ నగరత్నమ్మ అన్నారు. దీంతో వెంటనే దాడికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రతిజాప్రతినిధులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అలాగే పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఎంఇఒ కృష్ణయ్య నాడు-నేడు పనుల పురోగతిపై వివరించారు. వ్యవసాయ అధికారి ముస్తఫా మాట్లాడుతూ మండలంలో 12500 హెక్టార్లలో పంటలు సాగు చేశారన్నారు. త్వరనే మండలవ్యాప్తంగా సబ్సిడీ విత్తన కాయలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అలాగే పంటలు నష్టపోయిన రైతుల వివరాలను ప్రభుత్వానికి నివేదించామన్నారు. ఎంపిటిసి శంకర్‌ మాట్లాడుతూ ఎరువుల దుకాణాల్లో ధరల పట్టికలు ఏర్పాట్లు చేయించాలి కోరారు. ఉద్యానవన అధికారిణి ఫజులున్నీసా మాట్లాడుతూ డ్రిప్పులు, స్పీకర్లు 25 వేల హెక్టార్లకు మంజూరైనట్లు తెలిపారు. అలాగే వర్షాలకు దెబ్బతిన్న పండ్ల తోటల రైతుల వివరాలను ఉన్నతాధికారులను నివేదించామని వివరించారు. వీరితోపాటు ఆయా శాఖల అధికారులు వారి శాఖల్లో జరిగిన అభివృద్ధి, పురోగతిపై వివరించారు. ఈ సమావేశంలో ఎంపిడిఒ దివాకర్‌, తహశీల్దార్‌ నారాయణస్వామి, జడ్పీటీసీ రత్నమ్మ, ఎంపీపీ నాగేశ్వరరావు, ఎంపిటిసిలు రమాదేవి, శారదా, శంకర్‌, భాగ్యలక్ష్మి, వెంకటనారాయణమ్మ, ఎంఇఒ కృష్ణయ్య, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్లు, తదితరులు పాల్గొన్నారు.