ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్ శ్రీసత్యసాయి తాగునీటి పథకం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన స్సందనలో కలెక్టర్ ఎం.గౌతమిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీసత్యసాయి తాగునీటి పథకం కార్మికులకు 3 నెలల బకాయి వేతనాలు, పిఎఫ్, ఇఎస్‌ఐ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, బోనస్ చెల్లించాలన్నారు. సమస్యలపై సమ్మె చేసిన సందర్భంగా అధికారులు రాతపూర్వకంగా హామీలు ఇచ్చారని తెలిపారు. 20 రోజులైనా అమలు చేయలేదన్నారు. కార్మికులు పస్తులతో పని చేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ముత్యాల నాయుడుని కూడా కలిసి వినతిపత్రం అందజేశామన్నారు. నిధులు సమృద్ధిగా ఉన్నాయని డబ్బు సమస్య లేదని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. తక్షణమే 3 నెలల వేతనాలు, పిఎఫ్, ఇఎస్‌ఐ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, బోనస్ వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీసత్యసాయి తాగునీటి పథకం కార్మికుల యూనియన్ అధ్యక్షులు హెచ్.తిప్పేస్వామి, రమేష్‌రెడ్డి, రవి, ఆచారి, వీరంజనేయులు, సుంకన్న తదితరులు పాల్గొన్నారు.










