ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ శ్రీసత్యసాయి శ్రీరామిరెడ్డి తాగునీటి సరఫరా పథకంలో పని చేస్తున్న కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.నాగేంద్రకుమార్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందనలో కలెక్టర్ ఎం.గౌతమిని కలిసి వచ్చేనెల 1వ తేదీ నుంచి కార్మికుల నిరవదిక సమ్మెలోకి వెళ్తున్నట్లు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా నాగేంద్రకుమార్ మాట్లాడుతూ తాగునీటి పథకంలో 575 మంది కార్మికులు గ్రామాలకు నీరు సరఫరా చేస్తున్నారని తెలిపారు. ధీర్ఘకాలికంగా సమస్యలు పరిష్కరించకుండా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. సమస్యలు ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం భాగంగా నాలుగు రోజులు సమ్మె నిర్వహించామన్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఇబ్బందులు రాకూడదని కలెక్టర్‌గా చొరవ తీసుకుని మూడు రోజుల్లోనే వేతనాలు చెల్లిస్తామని హామి ఇచ్చారని గుర్తు చేశారు. రూ.32 కోట్ల గ్రాంట్ వస్తుందని మాట ఇచ్చారు, నేటికీ 17 రోజులు గడచినా మాకు ఎటువంటి న్యాయం జరగలేదన్నారు. తక్షణమే పరిశీలించి వేతనాలు చెల్లించాలని, సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే 1వ తేదీ నుంచి నిరవదిక సమ్మెలోకి వెళ్లనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీసత్యసాయి, శ్రీరామిరెడ్డి కార్మికుల యూనియన్ ప్రధాన కార్యదర్శులు తిప్పేస్వామి, శ్రీనివాసులు, ఎస్.రమేష్‌రెడి,్డ రవీంద్రాచారి, నాగరాజు, రామాంజనేయులు, ఎం.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఎమ్.గౌతమికి సమస్యలను వివరిస్తున్న సిఐటియు నాయకులు










