Mar 17,2023 22:53

మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర నాయకులు ఓబులు

ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌       శ్రీసత్యసాయి, శ్రీరామిరెడ్డి తాగునీటి పథకంలో పనిచేస్తున్న కార్మికుల న్యాయమైన సమస్యలైన గ్రాట్యూటీ, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌, బోనస్‌, సమ్మె కాలపు వేతనాలు, బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం నిరవదిక సమ్మె చేపట్టారు. పిఎబిఆర్‌ డ్యామ్‌ వద్ద శ్రీసత్యసాయి, శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్మికుల యూనియన్‌, సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ప్లకార్డులు చేతపట్టి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తాగునీటి ప్రాజెక్టుల నిర్వహణకు ప్రభుత్వాలు శాశ్వత ప్రాతిపాదికన బడ్జెట్‌ కేటాయింపులు చేయాల్సి ఉందన్నారు. అలాచేయక పోవడంతో పనిచేస్తున్న కార్మికులకు ప్రతి నెలా సకాలంలో వేతనాలు అందని దుస్థితి నెలకొందన్నారు. నెలల తరబడి వేతనాలు బకాయిలు పడుతున్నాయని తెలిపారు. వేతనాలు ఇవ్వమంటే కాంట్రాక్టర్‌, అధికారులు ఒకరిపై ఒకరూ చెప్పుకుంటూ కార్మికులను ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. సమ్మెలు చేస్తే తప్ప స్పందించని దుస్థితి ఏర్పడిందన్నారు. గత సమ్మె సమయంలో ప్రభుత్వం, అధికారులు చర్చలు జరిపి పలు హామీలు ఇచ్చారన్నారు. ఆ హామీలు అమలు చేయలేదన్నారు. గ్రాట్యుటీ, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌, బోనస్‌, 2 నెలల వేతనాలు ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదన్నారు. ఇప్పుడు సమ్మెచేస్తున్న సమయంలో వేతనాలు ఇచ్చి సరిపెట్టేందుకు చూస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీసత్యసాయి కార్మికుల యూనియన్‌ అధ్యక్షులు తిప్పేస్వామి, వివిధ ప్రాజెక్టుల నాయకులు శ్రీరాములు, నాగరాజు, రాము తదితరులు పాల్గొన్నారు.