Sep 01,2023 22:03

సిఐటియు ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్న కార్మికులు

        అనంతపురం కలెక్టరేట్‌ : శ్రీసత్యసాయి తాగునీటి పథకం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు, స్ట్రగూల్‌ కమిటీ నాయకులు, కార్మికులతో నిర్వహించిన చర్చలు విఫలం అయ్యాయి. బకాయి వేతనాలు, పిఎఫ్‌, గ్రాట్యూటీ చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ కార్మికులు సమ్మె చేపట్టారు. ఇదివరకే అధికారులు చర్చలు నిర్వహించినా కార్మికుల నుంచి సానుకూలత రాలేదు. దీంతో శుక్రవారం స్ట్రగుల్‌ కమిటీ నాయకులతో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఇ ఇతర అధికారులు శ్రీసత్యసాయి బోర్డ్‌ కార్యాలయంలో చర్చలు నిర్వహించారు. సిఐటియు, వైఎస్‌ఆర్‌టియు, ఐఎఫ్‌టియు మూడు సంఘాలు స్ట్రగుల్‌ కమిటీగా ఏర్పాటై కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాట కార్యచరణ ప్రకటించి కార్మికులంతా ఐక్యంగా సమ్మెలోకి వెళ్లారు. చర్చలకు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగేంద్రకుమార్‌, వైఎస్‌ఆర్‌టియు జిల్లా అధ్యక్షులు కెవి.రమణ, ఐఎఫ్‌టియు జిల్లా కార్యదర్శి ఉపేంద్ర హాజరయ్యారు. అధికారులు కార్మికులకు 1 నెల వేతనం చెల్లిస్తున్నాం, సమ్మె విరమించాలని తెలిపారు. 5 నెలల వేతనాలు రావాల్సి ఉండగా ఒక నెల వేతనం ఇస్తే ఒప్పుకునేది లేదంటూ సిఐటియు నాయకత్వం అధికారులకు తెలిపింది. వైఎస్‌ఆర్‌టియు, ఐఎఫ్‌టియు నాయకత్వం మాత్రం నెల వేతనంతో సమ్మతించి సమ్మె విరమిస్తున్నట్లు తెలిపారు. స్ట్రగుల్‌ కమిటీ నిర్ణయాలకు వ్యతిరేకంగా అధికారులతో మమేకం అవుతూ వారు చెప్పిన వాటికి అంగీకరించడాన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకించింది. సిఐటియు అనుబంధంగా కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నట్లు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగేంద్రకుమార్‌ అధికారులకు తెలిపారు. ప్రభుత్వం నిర్లక్ష్యం, అధికారుల వైఖరిని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో శ్రీసత్యసాయి బోర్డు కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌ గేటు ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు వేతనాలు, పిఎఫ్‌, 22 సంవత్సరాలుగా చెల్లిస్తున్న సౌకర్యాలు అమలు చేసేంతవరకు సమ్మె యథావిధంగా కొనసాగింపు ఉంటుందని స్పష్టం చేశారు. కార్మికుల హక్కులు అడిగితే నిర్బంధం పాటించడం సరైనది కాదన్నారు. డిమాండ్లన్నీ పరిష్కారం అయ్యేవరకు సమ్మె కొనసాగిస్తామని మరోసారి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీసత్యసాయి కార్మికుల యూనియన్‌ నాయకులు శ్రీనివాసులు, మధుసూదన్‌, వన్నూరప్ప, గోవిందు, చింతకాయల నరేష్‌, రాము, శ్రీరాములు, లక్ష్మీరెడ్డి, చిన్న బాబయ్య, రవీంద్ర చారి, ప్రసాద్‌ పాల్గొన్నారు.