Aug 18,2023 21:28

రిలేదీక్షల్లో మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నరసింగరావు

         అనంతపురం కలెక్టరేట్‌ : చేసిన పనులకు వేతనాలు ఇవ్వాలంటూ 18 రోజులుగా శ్రీసత్యసాయి, శ్రీరామ్‌రెడ్డి తాగునీటి సరఫరా పథకం కార్మికులు రిలేదీక్షలు చేస్తుంటే వారి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్య ధోరణి అవలంభించడం సరికాదని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నరసింగరావు తెలిపారు. శ్రీసత్యసాయి, శ్రీరామిరెడ్డి కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన రిలేదీక్షలు శుక్రవారం 18వ రోజుకు చేరుకున్నాయి. వీరి దీక్షలకు నరసింగరావు హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల ప్రజలకు తాగునీరు అందించే కార్మికులకు వేతనాలు సకాలంలో చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అలాంటిది నెలల తరబడి కార్మికులకు వేతనాలు బకాయి పడుతుంటే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఒక నెల అలవెన్స్‌లు రాకపోతే ప్రజాప్రతినిధులు ఊరికే ఉంటారా అని ప్రశ్నించారు. సామాన్య మధ్యతరగతి, నిరుపేద కార్మికులు వేతనాలపై ఆధారపడి జీవిస్తున్నారని, అలాంటి వారికి వేతనాలు సకాలంలో ఇవ్వాలన్నారు. శాశ్వత స్వభావం కలిగిన పనులు చేస్తున్న కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేలా సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి శ్రీసత్యసాయి, శ్రీరామిరెడ్డి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా ప్రజాప్రతినిధుల, అధికారులు అందరికీ వినతి పత్రాలు సమర్పించామన్నారు. స్వయాన కలెక్టర్‌ ఎమ్‌.గౌతమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయాలని యత్నించినప్పటికి ఫైనాన్స్‌ విభాగంలో ఇందుకు సంబంధించిన బిల్లులు నిలిపివేశారన్నారు. ఈ పరిస్థితుల్లో కార్మికుల సమస్యలు ఎవరూ పరిష్కరిస్తారో దిక్కుతోచని స్థితి నెలకొందన్నారు. అందుకోసమే ఈ నెల 25 నుంచి నిరవధిక సమ్మెలోకి కార్మికులు వెళుతున్నారని తెలిపారు. ఇప్పటికే జిల్లా అధికారులకు సమ్మె నోటీసులు అందజేశామన్నారు. ప్రజలకు ఇబ్బందులు రాకూడదని ఇన్ని రోజులు శాంతియుతంగా నిరసనలు చేపట్టామన్నారు. కార్మికుల జీవన్మరణ సమస్యగా తలెత్తడంతోనే సమ్మెలోకి వెళుతున్నారని తెలిపారు. దీని వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఆలోపు సమస్యలు పరిష్కరించి సమ్మె విరమింపజేస్తే బాగుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీసత్యసాయి, శ్రీరామ్‌రెడ్డి తాగునీటి సరఫరా కార్మికుల యూనియన్‌ నాయకులు నాగరాజు, తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు.