Mar 06,2022 23:10

సంస్థ ఛైర్మన్‌ భరత్‌ మోహింద్ర, శ్రీసిటీ అధికారులు, ఇతర ప్రతినిధులు

భూమి పూజ చేసిన సంస్థ ఛైర్మన్‌ భరత్‌ మోహింద్ర
ప్రజాశక్తి - సత్యవేడు:
అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్‌ దష్ట్యా, శ్రీసిటీలోని జెన్‌ లినెన్‌ పరిశ్రమ తమ అదనపు ఉత్పత్తి కేంద్రానికి ఆదివారం భూమిపూజ చేపట్టింది. ఆ సంస్థ ఛైర్మన్‌ భరత్‌ మోహింద్ర లాంఛనంగా భూమిపూజ నిర్వహించారు. శ్రీసిటీ ప్రెసిడెంట్‌ (ఆపరేషన్స్‌) సతీష్‌ కామత్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ (కస్టమర్‌ రిలేషన్స్‌) రమేష్‌ కుమార్‌, ఇంకా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని భరత్‌ మోహింద్ర, జెన్‌ లినెన్‌ బందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా భరత్‌ మోహింద్ర మాట్లాడుతూ, తూర్పు దక్షిణాసియాలో బెడ్లు, పిల్లోల తయారీలో నెంబర్‌ 1 స్థానంలో వున్న తాము, తమ వ్యాపార విస్తరణలో భాగంగా శ్రీసిటీలో 1.35 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అదనపు ప్లాంట్‌ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. శ్రీసిటీలో తమ పరిశ్రమ ఏర్పాటై ఏడేండ్లు గడిచిందని, ఇక్కడ వసతులతో పాటు శ్రీసిటీ యాజమాన్య సహకారం బాగుంద న్నారు. ఈ కారణాలతోనే తమ పరిశ్రమ విస్తరణ చేపడుతున్నామని, భవిష్యత్తులో ఇంకా విస్తరణ దిశగా పయనించగలమన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
పరిశ్రమ విస్తరణ చేపట్టిన జెన్‌ లినెన్‌ యాజమాన్యానికి శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి అభినందనలు తెలిపారు. నాణ్యమైన బెడ్‌ ఉత్పత్తులలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జెన్‌ లినెన్‌ సంస్థ, పురోగతి దిశగా పయనిస్తూ ప్లాంట్‌ విస్తరణ చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. పెరుగుతున్న వ్యాపార అవకాశాల దష్ట్యా ఇప్పటికే శ్రీసిటీలో ప్రస్తుతం ఉన్న పరిశ్రమలలో 20 శాతం పరిశ్రమలు తమ ప్లాంట్‌ ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకున్నాయని తెలిపారు. పలు పరిశ్రమలు శ్రీసిటీలో విస్తరణకు మొగ్గుచూపడం, ఇక్కడ వ్యాపార అనుకూల వాతావరణానికి అద్దం పడుతోందన్నారు. ఈ పరిశ్రమలో ఎక్కువగా మహిళా కార్మికులు పనిచేస్తుండడం పట్ల కూడా ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్లాంట్‌ విస్తరణ ద్వారా మహిళలకు అదనపు ఉద్యోగ అవకాశాలు కలగడంతో పాటు, ఈ ప్రాంతంలో ఆర్థిక వద్ధిని మరింత పెంచుతుందన్నారు.