ప్రజాశక్తి అనంతపురం శరీర దానం వల్ల వైద్య విద్యార్థుల్లో జ్ఞానాన్ని సమపార్థం చేసే వీలు ఉంటుందని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీదేవి తెలిపారు. అనంతపురానికి చెందిన సి.ఓబులమ్మ (64) మృతదేహాన్ని తన భర్త సి.వెంకటదాస్ మెడికల్ కళాశాలలోని అనాటమీ విభాగానికి అందిస్తూ వీలునామా రాసి ప్రిన్సిపాల్ శ్రీదేవి, అనాటమీ ప్రధాన విభాగాధిపతి డాక్టర్ ఉమామహేశ్వరరావు సమక్షంలో సోమవారం అందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మట్లాడుతూ మన దేహం మట్టిలో కలిసిపోయే కంటే వైద్య విద్యార్థులు మానవ అంతర్నిర్మాణ శాస్త్రాన్ని చదువుకోవడానికి అందిస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. మనిషి శారీరక నిర్మాణం ఏ విధంగా ఉంది అన్న విషయాన్ని ప్రథమ సంవత్సరంలో వైద్య విద్యార్థులు శవాల అవయవాలను శోధించే ప్రక్రియలో తెలుసుకుంటారన్నారు. అత్యంత మానవత్వం, గొప్ప ముందుచూపు, సానుకూల దృక్పథం ఉన్నవారే ఇలాంటి వాటిని చేస్తారని తెలిపారు. సి.వెంకటదాస్ మాట్లాడుతూ తమ కుటుంబ సభ్యుల కోరిక మేరకు తన అర్ధాంగి మృతదేహాన్ని వైద్య విద్యార్థుల జ్ఞానం కోసం అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ కెఎల్.సుబ్రమణ్యం, షారోన్ సోనియా, అనాటమీ అధ్యాపకులు పునర్జీవన్ కుమార్, డాక్టర్ బోనాల శహజీర్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఆదిరెడ్డి పరదేశీనాయుడు, తదితరులు పాల్గొన్నారు.
వైద్య కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవికి వీలునామాను అందజేస్తున్న వెంకటదాస్










