సిఐటియు ఆధ్వర్యంలో కరపత్రాల పంపిణీ
ప్రజాశక్తి- శ్రీకాళహస్తి రూరల్
మండలంలో ఉన్న 46 పంచాయితీలలో రాచగున్నెరి పంచాయతీ మేజర్ పంచాయతీ గా ఉంది. ఈ పంచాయతీలో మండలంలో ఉన్న కర్మాగారాల అన్నిటిలోకి అతి పెద్ద కర్మాగారంగా పేరుగాంచిన శ్రీకాళహస్తి పైప్స్ లిమిటెడ్ కర్మాగారం ఉండటం దీని ద్వారా ఎన్నో వేలమంది కార్మికులకు ఉపాధి దొరకటం ఎంతో సంతోషించదగ్గ విషయం. కానీ ఇక్కడ పనిచేస్తున్న కార్మికుల పై యాజమాన్యం అనుసరిస్తున్న తీరును తెలుసుకున్న సీ.ఐ.టీ.యూ ఎలాగైనా కార్మికులను సమస్యల నుంచి బయటకు తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో మొదటగా కార్మికుల సమస్యల గురించి కరపత్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. శనివారం సి.ఐ.టి.యు డివిజన్ కార్యదర్శి పెనగడం గురవయ్య ఆధ్వర్యంలో కర్మాగారం మూడవ గేటు వద్ద కార్మికులకు కరపత్రాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు చుట్టుపక్కల గ్రామ ప్రజల పట్ల శ్రీకాళహస్తి పైప్స్ లిమిటెడ్ యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరుపైన ఆయన మండిపడ్డారు. పరిశ్రమ లోపల కార్మికులకు, ఉద్యోగులకు భద్రత లేదని, కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వకుండా వెట్టిచాకిరీ చేయిస్తున్నారని, సీనియార్టీ ప్రకారం ప్రమోషన్ జీతాలు ఇవ్వకపోవడం బాధాకరమైన విషయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు, ఉద్యోగులకు మధ్య తేడా చూపుతో వారి మధ్య విభేదాలు సష్టించి యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరు మంచి పద్ధతి కాదని మండిపడ్డారు. చుట్టుపక్కల గ్రామాల్లో అనేక మంది యువతీ, యువకులు చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నారన్నారు. కంపెనీని నిర్మించడానికి ఇక్కడ మన భూములు ఇచ్చి పరిశ్రమల వల్ల వచ్చే కాలుష్యం అంత మనమే పీల్చుకుంటూ కంపెనీలో మాత్రం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిచేత పని చేయించుకుంటూ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారిని నిరుద్యోగులుగా మిగల్చడం ఎంతవరకు న్యాయమని ఆయన కంపెనీ యాజమాన్యాన్ని నిలదీశారు. ఇకనైనా సంబంధిత యాజమాన్యం చుట్టుపక్కల చదువుకున్న అనేక మందికి ఉద్యోగాలు ఇవ్వాలని, గ్రామాల్లో అభివద్ధి చేయాలని యాజమాన్యాన్ని సి.ఐ.టి.యు తరపున కోరింది. లేనిపక్షంలో కార్మికులు, చుట్టుపక్క గ్రామ ప్రజలు, యువతీ యువకులు అందరిని కలుపుకొని యాజమాన్యంపై పోరాటానికి సిద్ధం కావాల్సి వస్తుందని తెలిపారు. అలాగే కార్మికులకు హోదాతో కూడిన గుర్తింపు కార్డులు ఇవ్వాలని సీనియర్ వెయిటేజీ, ప్రమోషన్ ఇవ్వాలని 2021- 22 సంవత్సరంలో తొల గించిన కార్మికుల వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు. కార్మికులకు ఇచ్చిన నోటీసును వెనక్కి తీసుకోవాలని, సీనియార్టీ ప్రకారం కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలన్నారు. ఏ కారణం చేత అయినా కార్మికుడు మరణిస్తే ఆ కార్మికుడి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాల న్నారు. అలాగే వెంకటగిరి, పుత్తూరు రూట్లలో బస్సులు నడపాలని కోరారు. గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని యాజమాన్యాన్ని హెచ్చరించారు. లేనిపక్షంలో ఉద్యమం తప్పదని యాజమాన్యానికి తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బాలకష్ణ, వెళ్లి వెంద్ర, కార్మికులు పాల్గొన్నారు.










