
* ఎస్‌పి జి.ఆర్ రాధిక
ప్రజాశక్తి - ఇచ్ఛాపురం: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలని ఎస్‌పి జి.ఆర్ రాధిక పోలీసు అధికారులను ఆదేశించారు. ఇచ్ఛాపురం సరిహద్దు ప్రాంతం పురుషోత్తపురం చెక్‌పోస్టును బుధవారం పరిశీలించారు. సిసి కెమెరాలు ఎక్కువగా ఉండేలా చూడాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది, స్థానిక పోలీసులు సమన్వయంతో నిరంతరం తనిఖీ చేసి గంజాయి, నాటుసారా, మద్యం అక్రమ రవాణాను అడ్డుకోవాలని ఆదేశించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో సిబ్బంది అందరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతకుముందు ఇచ్ఛాపురం రూరల్ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డుల నిర్వహణ తీరును పరిశీలించారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. సిబ్బంది సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో కాశీబుగ్గ డిఎస్‌పి నాగేశ్వర్‌రెడ్డి, సిఐ ఈశ్వరచంద్ర ప్రసాద్, పట్టణ, రూరల్ ఎస్‌ఐలు గోవిందరావు, రమేష్ పాల్గొన్నారు.