ప్రజాశక్తి-అనంతపురం జిల్లా రచయితల సంఘం ఏర్పాటు చేసిన 'ఎర్రపద్యాలతో ఒక సాయంత్రం' కార్యక్రమం కార్మిక, శ్రామికుల గుండె గొంతును వినిపించిందని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ అన్నారు. జిరసం ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి సురేష్ అధ్యక్షతన, కళ్యాణదుర్గం రోడ్డులోని ఎస్‌ఎఫ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లా రచయితల సంఘం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకమైందన్నారు. సిపిఐ సత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ మాట్లాడుతూ కర్షక, కార్మికుల పక్షాన నిలిచే కవిత్వమే అసలైన కవిత్వం అన్నారు. ఈ దిశగా జిరసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సత్యశోధక్ సమాజ్ వ్యవస్థాపక అధ్యక్షులు పోతుల రాధాకృష్ణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్నాయన్నారు. కార్మికులకు అందాల్సిన వేతనాలు సరైన సమయంలో అందడం లేదన్నారు. తర్వాత ఎర్రపద్యాల కవిసమ్మేళనాన్ని గోసల నారాయణస్వామి నిర్వహించగా అనేకమంది కవులు వారి కవిత్వాన్ని చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో చం శాస్త్రి, ముడార్ సుధీర్, తరిమెల అమరనాథరెడ్డి, జిరసం గౌరవ సలహాదారు కంబదూరి షేక్ నబిరసూల్, అప్పిరెడ్డి హరినాథ్‌రెడ్డి, కోటిగారి వన్నప్ప, మిద్దె మురళీకృష్ణ, చేగువేరా హరి, మధురశ్రీ, శివారెడ్డి, ఒంటెద్దు రామలింగారెడ్డి, టీవీ రెడ్డి, అశోక్, మురళి, మౌర్య తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్










