ప్రజాశక్తి - భీమవరం రూరల్
సామాజిక సేవతో పాటు విద్యారంగం ప్రగతికి కృషి చేసిన సాగి రామకృష్ణంరాజు నేటి సమాజానికి స్ఫూర్తి ప్రదాత అని శాసనమండలి ఛైౖర్మన్ కొయ్యే మోషనురాజు తెలిపారు. భీమవరం ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజినీరింగ్ కళాశాల, ప్రసాద్ అండ్ కో కనస్ట్రక్షన్స్ సంయుక్త ఆధ్వర్యంలో సాగి రామకృష్ణంరాజు 90వ జయంతి ఉత్సవాలు బుధవారం కళాశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణంరాజు విగ్రహానికి శాసనమండలి ఛైర్మన్ మోషేనురాజు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కళాశాల అధ్యక్షులు సాగి ప్రసాదరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మోషేనురాజు మాట్లాడుతూ చినఅమిరం వంటి చిన్న కుగ్రామంలో సుమారు 43 సంవత్సరాల క్రితం ఇంజినీరింగ్ కళాశాలను స్థాపించి దేశంలో ఆదర్శవంతమైన విద్యాలయంగా దీన్ని తీర్చిదిద్దడంలో ఆయన కృషి మరువలేనిదన్నారు. ఈ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ప్రజా సేవా ఫౌండేషన్ ఏర్పాటు చేసి తమ స్వగ్రామమైన చినఅమిరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వారి వారసులు రామకృష్ణంరాజుపై చూపుతున్న ప్రేమకు తార్కాణమని చెప్పారు. సెంచూరియన్ యూనివర్సిటీ ఛాన్సలర్ జిఎస్‌ఎన్.రాజు మాట్లాడుతూ నాగార్జునసాగర్ ప్రాజెక్టు కాంట్రాక్టర్‌గా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చేతుల మీదుగా మెటల్‌కింగ్ అవార్డు పొందిన రామకృష్ణంరాజు విద్యారంగానికి చేసిన సేవలు మరువరానివన్నారు. కళాశాల అధ్యక్షులు సాగి ప్రసాదరాజు, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్‌వర్మ మాట్లాడుతూ చినఅమిరంతో పాటు గ్రామంలోని పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి కూడా ట్రస్ట్ ద్వారా సహకార అందిస్తామని హామీ ఇచ్చారు. పేదలకు తమ ట్రస్ట్ సేవలందిస్తోందన్నారు. కళాశాల ప్రిన్సిపల్ ఎం.జగపతిరాజు మాట్లాడారు. అనంతరం కళాశాలకు వివిధ రంగాల్లో సేవలందించిన అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందిని ఘనంగా సత్కరించారు. సాగి అచ్యుతరామరాజు పేరిట కళాశాలలో అత్యధిక ప్రాజెక్టులు చేపట్టిన పిఎ రామకృష్ణంరాజును కూడా సత్కరించారు. అలాగే వికలాంగులకు ట్రై సైకిళ్లు అందజేశారు. కార్యక్రమంలో ఎంఎల్‌ఎ మంతెన రామరాజు, క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ పాతపాటి శ్రీనివాసరాజు, మాజీ ఎంఎల్‌ఎ పులపర్తి రామాంజనేయులు, సిబ్బంది పాల్గొన్నారు.










