ప్రజాశక్తి వార్తకు స్పందన
స్పందనకు వందనం
రైతు పొలంలో సర్వే చేస్తున్న రెవెన్యూ అధికారులు
ప్రజాశక్తి- యాదమరి: 'రెవెన్యూ కార్యాలయంలో రికార్డులు మాయం' అనే శీర్షిక సోమవారం ప్రజాశక్తి దినపత్రికలో ప్రచురితమైనది. ఈ వార్తపై స్పందించిన యాదమరి తహశీల్దార్ చిట్టిబాబు తనసిబ్బందితో బుధవారం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. దోమ్మాదూరు గ్రామం మునిరత్నంరెడ్డి 2010 ఐదో విడత భూపంపిణీలో పట్టాదార్ పాస్ పుస్తకం, డిఫామ్, అప్పటి రెవెన్యూ అధికారులు అందించారు. ఆ పుస్తకంను అప్పట్లో ఆన్లైన్లో నమోదు చేయ కుండానే రైతుకు అందించారు. ఏడేళ్లుగా ఆన్లైన్ నమోదు కార్యాలయం చుట్టూ తిరిగిన ప్రయోజనం లేకపోయింది. దీంతో రైతు అతని భూమి వివరాల కోసం సమాచారహక్కు చట్టం ద్వారా రెవెన్యూ కార్యాలయం దరఖాస్తు చేసుకున్నాడు. అందులో భూమికి సంబంధించిన రికార్డులు నమోదు కాలేదని కార్యాలయం లోలేదని అధికారులు సమాధానమివ్వడంతో అతని ఆవేదనను పత్రికలు దష్టికి తీసుకొచ్చాడు. యాదమరి తహశీల్దార్ చిట్టిబాబు ఆదేశాల మేరకు దొమ్మదూరు మునిరత్నంరెడ్డి పొలంను రెవెన్యూ ఇన్స్పెక్టర్ శివజ్యోతి, సర్వేయర్ ప్రేమ్, వీఆర్వో వెంకటేష్ పిళ్ళై మునిరత్నం రెడ్డి భూమిని సర్వే చేశారు. 186 నడింపల్లి రెవెన్యూ 102/4లో పూర్తిస్థాయిలో సర్వే చేపట్టగా రైతు అనుభవంలో ఉన్న నెంబరు అతనికి భూపంపిణీలో ఇచ్చిన పట్టాదారు పాస్‌పుస్తకం, డిఫామ్‌లో నమోదైన నెంబరు వేరుగా ఉండడం అధికారులు విచారణలో గుర్తించారు. వారికి పట్టాదారు డిఫామ్‌లో ఇచ్చిన సర్వేనెంబరు 104 /4 రెవెన్యూ రికార్డులు నందు బండి దారిగా నమోదై ఉన్నది. అతను అనుభవిస్తున్న భూమి సర్వే నెంబర్ 104/ 5లో అతను మామిడి పంటసాగు చేసుకున్న భూమి అతని అనుభవంలో ఉన్నదిగా గుర్తించారు. అతని భూమిని పూర్తిస్థాయిలో రైతు సమక్షంలో సర్వే చేపట్టినారు. సర్వే నివేదికను తహశీల్దార్‌కు అందించారు. రైతు వ్యవసాయం చేసుకుంటున్న భూమి అతని అనుభవంలో ఉండడంతో నివేదికను పైస్థాయి అధికారులకు అందించి వారి ఆదేశాలకు అనుగుణంగా రైతు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. గత భూపంపిణీలో సర్వేనెంబర్ నమోదులో అప్పటి రెవెన్యూ సిబ్బంది పొరపాట్ల, నిర్లక్ష్యం వలన రైతు మునిరత్నంరెడ్డి ఆన్లైన్‌లో నమోదు చేసుకోలేక వేచి ఉండాల్సిన పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతు సమస్యకు పరిష్కారం వైపు అడుగులేయడం అభినందనీయం.










