
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. పలు వ్యక్తిగత, సామాజిక సమస్యలపై 175 వినతులు వచ్చాయి. జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి గణపతిరావు, డిఆర్‌డిఎ పీడీ విద్యాసాగర్ వినతులు స్వీకరించారు. సారవకోట మండలం బద్రిలో 1984లో రోడ్డు నిర్మాణానికి సేకరించిన భూములకు నేటికీ నష్టపరిహారం చెల్లించలేదని ఆ గ్రామానికి చెందిన పలువురు ఫిర్యాదు చేశారు. నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. వంశధార నిర్వాసితులకు అదనపు పరిహారం పూర్తిస్థాయిలో చెల్లించలేదని పలువురు నిర్వాసితులు ఫిర్యాదు చేశారు. భూములు కోల్పోయి, గ్రామాలను ఖాళీ చేసి ఏళ్లు గడుస్తున్నా పరిహారం చెల్లింపులో జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వంశధార ప్రాజెక్టు నుంచి ఇచ్ఛాపురం వరకు తాగునీరు అందించే ప్రాజెక్టు పైపులైన్లను సాగు భూముల్లో వేశారని, రైతులకు ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా పంట పొలాల్లో తవ్వకాలు చేపట్టారని తెలిపారు. శ్రీకాకుళం రూరల్ మండలం గణగళ్లవానిపేటలో భూ ఆక్రమణలు తొలగించాలని మత్స్యకార సహకార సంఘం జిల్లా మాజీ అధ్యక్షులు మైలపల్లి నర్సింగరావు ఫిర్యాదు చేశారు. కెజిబివిల్లో 18 ఏళ్లుగా పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీలను తొలగించారని, వారిని పునరుద్ధరించి నియామకాలు ఇవ్వాలని పలువురు మహిళలు వినతిపత్రం అందజేశారు.
ఇద్దరు తహశీల్దార్లకు షోకాజ్ నోటీసులు
స్పందనతో పాటు జగనన్నకు చెబుదాంలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను జెసి ఆదేశించారు. నిర్ణీత కాల వ్యవధిలోగా పరిష్కరించని టెక్కలి, హిరమండలం తహశీల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలన్నారు. స్పందన అనంతరం జిల్లా ఉన్నతాధికారులతో ఆయన మాట్లాడారు. ఫిర్యాదుదారులకు ఇచ్చే సమాధానం పూర్తి వివరాలతో ఉండాలన్నారు. కార్యక్రమంలో జెడ్‌పి సిఇఒ ఆర్.వెంకట్రామన్, జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్, సమగ్ర శిక్ష ఎపిసి రోణంకి జయప్రకాష్, డిఎస్‌ఒ వెంకటరమణ, డ్వామా పీడీ చిట్టిరాజు, డిఎంహెచ్‌ఒ మీనాక్షి, ఇతర అధికారులు పాల్గొన్నారు.