
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్:టిడిపి బంద్‌కు పిలుపునివ్వడం, వ్యవసాయ పనుల్లో రైతులు తలమునకలై ఉండడంతో 'స్పందన'కు వినతుల సంఖ్య తగ్గింది. నగరంలోని జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, జాయింట్ కలెక్టర్ నవీన్ వినతులు స్వీకరించారు. జిల్లావ్యాప్తంగా పలు సమస్యలపై 132 వినతులను స్వీకరించారు. జిల్లాలో ఇటీవల చేపట్టిన సమగ్ర భూసర్వేలో లోపాలను సరిదిద్దాలని పలువురు రైతులు కోరారు. నందిగాం మండలం కణితూరుకు చెందిన పలువురు రైతులతో కలిసి ఎంపిటిసి సభ్యుడు మెట్ట శ్యామలరావు వినతిపత్రం అందజేశారు. పాసు పుస్తకాల్లో పేర్లు తప్పుగా నమోదయ్యాయని, వాటిని సవరించాలని కోరారు. హక్కుదారులను కాదని వేరే వ్యక్తుల పేర్లతో పాసు పుస్తకాలు వస్తున్నాయని, వాటిని సరిదిద్దాలని ఆధారాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. సమగ్ర శిక్షలో కాలవ్యవధి ఆధారంగా తరగతులను నిర్వహించిన అధ్యాపకులను ఇటీవల జరిగిన నియామకాల్లో ప్రాధాన్యత కల్పించలేదని, ప్రస్తుతం జిల్లాలో ఖాళీగా ఉన్న 46 పోస్టుల్లో నియామకాలను చేపట్టి ఉద్యోగాల్లో కొనసాగించాలని కోరుతూ పలువురు అభ్యర్థులు వినతిపత్రం అందజేశారు. వీటితోపాటు వ్యక్తిగత, సామాజిక అవసరాలను తీర్చాలని కోరుతూ పలువురు వినతిపత్రాలను అందజేశారు.
పదేపదే వస్తున్న వినతులపై దృష్టిసారించాలి
జిల్లాలో స్పందన, జగనన్నకు చెబుదాం, ఎపి ఆన్‌లైన్‌లో వస్తున్న ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించకపోతే ఒకే దరఖాస్తు పదేపదే వస్తుందని, దీనివల్ల బాధితులకు వ్యయంతో పాటు సమయం వృథా అవుతుందని కలెక్టర్ అన్నారు. స్పందన ద్వారా అర్జీదారులు లాభపడాలని, ఈ విషయంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలన్నారు. ట్రైనీ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ప్రత్యేక ఉప కలెక్టర్ జి.జయదేవి, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, డిఆర్‌డిఎ పీడీ డి.వి విద్యాసాగర్‌తో కలిసి వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి వి.ఎస్.ఎస్ లకీëప్రసన్న, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి.మీనాక్షి, జెడ్‌పి సిఇఒ ఆర్.వెంకట్రామన్, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, సమగ్ర శిక్ష అదనపు పథక సమన్వయకర్త ఆర్.జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.