స్పందనకు 169 అర్జీలు
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్:
స్పందనలో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్, డిఆర్‌ఓ రాజశేఖర్‌లతో కలసి జిల్లా నలుమూలల నుండి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. మొత్తం 169 అర్జీలు రాగా ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 133, హౌసింగ్‌కు 5, డ్వామా శాఖ 4, పోలీసు శాఖలకు 3, డిఎస్‌ఓ శాఖకు 2, సంక్షేమ శాఖకు 6, ఇతర 16 అర్జీలు రావడం జరిగిందని తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు జిల్లా కలెక్టర్, జేసి, డిఆర్‌ఓకు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీల మీద తరచూ సమీక్షిస్తున్నారని, జిల్లా అధికారులు వచ్చిన అర్జీల మీద సత్వరం చర్యలు తీసుకుని సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ జిల్లా అధికారులను ఆదేశించారు. ఈకార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.










