అనంతపురం కలెక్టరేట్ : అర్జీదారులు సంతప్తి చెందేలా స్పందన అర్జీలకు పరిష్కరించాలని కలెక్టర్ ఎమ్.గౌతమి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో స్పందన గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో 389అర్జీలను అధికారులు స్వీకరించారు. అనంతరం అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ శాఖల్లో నిర్ణీత గడువులోపే అర్జీలను పరిష్కరించేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అధికారులు పరిష్కరించిన అర్జీలకు సంబంధించిన అర్జీదారులు వారు ఆశించిన స్థాయిలో వారి దరఖాస్తు పరిష్కారం కానప్పుడే అవి రీఓపెన్ అవుతాయన్నారు. ఈ అంశంపై జిల్లా అధికారులందరూ ప్రత్యేక వ్యక్తిగత దష్టి సారించి వారి క్షేత్రస్థాయి సిబ్బందికి అర్జీలను నాణ్యతాయుతంగా,అర్జీదారులు సంతప్తి చెందేలా తగు సూచనలు జారీ చేయాలన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించిన 2723 సమస్యలకు సంబంధించిన అధికారులు ఆ సమస్యలపై తీసుకున్న చర్యలనివేదికను వెంటనే సిపిఒకు పంపాలన్నారు. స్పందన కార్యక్రమం అనంతరం ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, డిఅర్‌ఒ గాయత్రిదేవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీనివాసులు, సుధారాణి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.










