
* ఎస్‌పి జి.ఆర్ రాధిక ఆదేశం
ప్రజాశక్తి - సోంపేట: స్పందనలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్‌పి జి.ఆర్ రాధిక పోలీసు అధికారులను ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బారువ పోలీస్‌స్టేషన్‌ను బుధవారం తనిఖీ చేశారు. స్టేషన్‌లో రికార్డులను పరిశీలించారు. స్టేషన్ పరిసరాలు, గదులు, రిసెప్షన్ సెంటర్, కేసు దర్యాప్తు ఫైళ్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాపర్టీ గదిని సందర్శించి ప్రాపర్టీ వివరాలపై ఆరా తీశారు. స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. పలు ముఖ్యమైన కేసుల దర్యాప్తు సరళని పరిశీలించి పెండింగ్‌లో ఉన్న కేసును త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. గ్రామస్థాయిలో సమాచారాన్ని సేకరించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా దత్తత కానిస్టేబుళ్లు తరుచుగా గ్రామాల్లో సందర్శించాలన్నారు. రోడ్డు భద్రతపై, మత్తు పదార్థాల అనర్థాలపై ప్రజల్లో చైతన్యం కల్పించాలన్నారు. కార్యక్రమంలో డిఎస్‌పి నాగేశ్వర్ రెడ్డి, సోంపేట సిఐ రవిప్రసాద్, ఎస్‌ఐ చిరంజీవి, సిబ్బంది పాల్గొన్నారు.