అనంతపురం కలెక్టరేట్ : జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్ అర్జీలను పకడ్బందీగా పరిశీలన చేసి నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని కలెక్టర్ ఎం.గౌతమి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో డిఆర్‌ఒ గాయత్రీదేవి, ఆర్డీవో మధుసూదన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు, ఆన్సెట్ సిఇఒ కేశవ నాయుడుతో కలిసి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం, స్పందన అర్జీలకు పరిష్కారం చూపించడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యత తగ్గరాదన్నారు. నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాలన్నారు. జిల్లా అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రీవెన్స్ బియాండ్ ఎస్‌ఎల్‌ఎలోకి రాకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఒ ప్రశాంత్ కుమార్, డిఆర్డిఎ పీడీ నరసింహారెడ్డి, డీపీవో ప్రభాకర్ రావు, ఇన్‌ఛార్జి డిఇఒ నాగరాజుతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.










