
* టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శిరీష
వజ్రపుకొత్తూరు: సొంతూరు దేవునల్తాడకి సాగునీరు అందివ్వలేని దుస్థితిలో మంత్రి అప్పలరాజు ఉన్నారని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పలాస నియోజకవర్గం సమన్వయకర్త గౌతు శిరీష మండిపడ్డారు. మంగళవారం వంశధార శివారు ప్రాంతంలోని లింగాలపాడు, పాతటెక్కలి, ఎస్‌జె పురం, పొల్లాడ, దేవునల్తాడలో సాగునీరు అందక పంట నష్టపోయిన పొలాలను పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ మంత్రి అప్పలరాజుకు గౌతు, కింజరాపు కుటుంబాలను విమర్శించడం తప్ప నియోజకవర్గం అభివృద్ధి కోసం కనీసం పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. నియోజకవర్గం లో కొండలను కొల్లగొట్టడానికి ఉన్న శ్రద్ధ సాగునీరు అందించడంలో లేదన్నారు. మంత్రి అప్పలరాజు మాటల మంత్రి తప్ప చేతల మంత్రి కాదని ఎద్దేవా చేసారు. ఐదేళ్లుగా అధికారంలో ఉండి సాగునీరు అందించలేని అసమర్థ మంత్రిగా చరిత్రలో మిగిలిపోతారన్నారు. రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతుంటే ఎప్పుడైనా వంశధార కాలువలను పరిశీలించారా అని ప్రశ్నించారు. మంత్రి స్వగ్రామం దేవునల్తాడలోనే రైతులు మంత్రి అప్పలరాజుపై సాగునీటి కోసం కారాలు, మిరియాలు నూరుతున్నారంటే నియోజకవర్గంలో మంత్రి పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలన్నారు. 2019 నుండి సాగునీరు అందడం లేదని చెబుతున్న రైతులకు మంత్రి ఏమి సమాధానం చెబుతారని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు వజ్జ బాబూరావు, సూరాడ మోహనరావు, పుచ్చ ఈశ్వరరావు, కర్ని రమణ, శశిభూషణ్, గోవింద పాపారావు, అట్టాడ రఘు, అప్పారావు, అఖిల్ పాల్గొన్నారు.