Jul 05,2023 22:17

ఎన్‌ఆర్‌పి అగ్రహారంలో లబ్ధిదారుల నిరసన ర్యాలీ
ప్రజాశక్తి - ఉండి

              తమకు సొంత గ్రామంలోనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని మండలంలోని ఎన్‌ఆర్‌పి అగ్రహారం గ్రామంలోని ఇళ్ల స్థలాల లబ్ధిదారులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం ఎన్‌ఆర్‌పి అగ్రహారం గ్రామ వీధుల్లో ర్యాలీ నిర్వహించి గ్రామపంచాయతీ కార్యదర్శి జెవిటినాయుడు, ఉండి ఇన్‌ఛార్జి తహశీల్దార్‌ ఎస్‌.వీరాస్వామినాయుడులకు వినతి పత్రాలను అందించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఇళ్ల స్థలాల లబ్ధిదారులు మాట్లాడుతూ తమకు గతంలో ప్రభుత్వం ఆధీనంలో ఉన్న విజయ పాలశీతల కేంద్రం స్థలాలను ఇళ్ల స్థలాలుగా మార్చి జియో ట్యాగింగ్‌ కూడా చేశారన్నారు. కానీ తర్వాత కాలంలో అగ్రహారంలో ఇచ్చిన ఇళ్ల స్థలాల స్థానంలో వెలువర్రు గరువు ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కేటాయించినట్లు అధికారులు చెప్పారన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా గరువు ప్రాంతానికి వెళ్లడానికి సరైన రహదారి మార్గం లేదని, వర్షం వస్తే రహదారి మొత్తం చిత్తడి చిత్తడిగా మారుతుందని, తమకు ఇళ్ల స్థలాలు కేటాయించిన ప్రాంతంలో ఇప్పటికే సరైన వసతులు అందుబాటులో లేవని, ఇప్పుడు తమను అటువంటి ప్రాంతంలో ఇల్లు నిర్మించాలని అధికారులు బలవంతం చేస్తున్నారని వారు ఆరోపించారు. ప్రస్తుతం ఎన్‌ఆర్‌పి అగ్రహారంలో మూడున్నర ఎకరాల ప్రభుత్వ భూమి నిరుపయోగంగా ఉందని, ఆ భూమిని ఇళ్ల స్థలాల లబ్ధిదారులకు కేటాయించాలని వారు డిమాండ్‌ చేశారు. తమకు ప్రభుత్వ గుర్తింపు పత్రాలు అన్ని ఎన్‌ఆర్‌పి అగ్రహారం గ్రామంలోనే ఉన్నాయని, అక్కడే ఇళ్ల స్థలాలు కేటాయించాలని, కొత్తగా కేటాయించిన స్థలాల్లోకి తాము వెళ్లేది లేదని, అవసరమైతే ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్తామని వారు స్పష్టం చేశారు.