సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి.శ్రీనివాసులు డిమాండ్
ప్రజాశక్తి - మదనపల్లె రూరల్: ప్రేమించి పెళ్ళి చేసుకున్న పాపానికి మహమ్మద్ సనాను వేధించిన దిగువ గాండ్లపల్లెకు చెందిన రమేష్ కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి.శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్‌లో బాదితురాలు సనాతో కలసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాకు చెందిన మహమ్మద్ సనాను మదనపల్లె మండలం దిగువ గాండ్లపల్లెకి చెందిన రమేష్ జనవరి నాలుగవ తేదీన మదనపల్లె మండలం భూమక వారిపల్లి వద్ద ఉన్న చెన్నకేశవస్వామి ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారని వివరించారు. ప్రేమ పెళ్లిని అంగీకరించని రమేష్ కుటుంబ సభ్యులు సనాను వేధించి, హింసించారని, ఈ వేధింపులను భరించలేక, ప్రేమించిన సనాను వదులుకోలేక రమేష్ ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయాడన్నారు. అప్పటినుండి సనాపై రమేష్ తల్లి ఆదిలక్ష్మి, అక్కలు లావణ్య, జ్యోత్స్న, ధనశ్రీ, బావలు వెంకట్రమణ, హరీష్‌ల వేధింపులు మరింత ఎక్కువ కావడమేగాక ఇంటినుంచి గెంటివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరిగినా పోలీసులు రమేష్ మోసం చేశాడు. సొంత ఊరికెళ్లిపో అంటూ మహమ్మద్ సనాకు ఉచిత సలహాలు ఇచ్చారేర తప్ప సనాకు న్యాయం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాను వేధించి హింసించిన రమేష్ కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో అందరినీ సమీకరించి సనాకు మద్దతుగా ఆందోళనలు ఉదతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు హరీంద్రనాథ్ శర్మ పాల్గొన్నారు.










