Oct 08,2023 19:30

ఎపి శ్రామిక మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి

ప్రజాశక్తి-నెల్లూరు :ప్రస్తుత సమాజంలో ప్రజలకు కావాల్సి సనాతన ధర్మం కాదని.. సమాన ధర్మం అని ఆంధ్రప్రదేశ్‌ శ్రామిక మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ జిల్లా కార్యాలయంలో యుటిఎఫ్‌ మహిళా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య వక్తగా హాజరైన ఆమె మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చేసిన హామీలల్లో ప్రధానమైన మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అధికార పక్షం అణిచివేతను మానుకోని ప్రజాసమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలన్నారు. మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తున్న, సమర్ధిస్తున్న పార్టీలకు రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. సదస్సుకు అధ్యక్షత వహించిన యుటిఎఫ్‌ నాయకులు బి శ్రీదేవి మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించడంతో సరిపోదని, అది 2024 నుంచే అమలు చేయాల న్నారు. యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మణిపూర్‌లో జరగుతున్న దాడులను తీవ్రంగా ఖండించాలన్నారు. పాఠశాలల విలీనం వల్ల బాలికలు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. పాఠశాలల పరిరక్షణ, పాత పెన్షన్‌ విధానం అమలకు చేస్తున్న పోరాటాల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌.నాగమణి మాట్లాడుతూ మహిళా హక్కులంటే మానవహక్కులే అన్న విషయాన్ని ప్రభుత్వాలు గుర్తించి పాలన సాగించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్త శుద్ది ఉంటే మహిలా చట్టాలను అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయ ఉద్యమంతోపాటు సామాజిక ఉద్యమాల్లో మహిళలు అధిక సంఖ్యలో హాజరై ఉద్యమాలకు తోడ్పాటునందించాలన్నారు. యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌.నవకోటేశ్వరరావు మాట్లాడుతూ మత రాజ్యంలో మహిళలకు హక్కులు ఉండవని, ఈ నేపథ్యంలో లౌకిక రాజ్యాంగాన్ని పరిరక్షించుకొనేందుకు మహిళలు అందరూ ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వివి శేషులు, జివి చలపతి శర్మ మాట్లాడుతూ జిల్లాలో సారా వ్యతిరేక ఉద్యమం నుంచి అనేక ఉద్యమాలు నిర్వహించడంలో మహిళలు కీలక భూమికను పోషించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ సదస్సులో మహిళా నాయకులు ఎస్‌కె సాజిత బేగం, వి.రమాదేవి, కె.భారతి, జిల్లా కోశాధికారి ఎ.మురళీధరరావు, జిల్లా కార్యదర్శులు కె.నాగిరెడ్డి, ఎన్‌.సురేంద్రబాబు, హెచ్‌ మోహన్‌ ప్రసాద్‌, మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.