ప్రజాశక్తి-అనంతపురం అనంతపురం సన్ రే ఆసుపత్రి వైద్యులు అరుదైన చికిత్స అందించి వైద్య విధానంలో నూతన ఒరవడి సృష్టించారు. ప్రధాన నగరాలకు వెళ్లకుండా ఖరీదైన వైద్యాన్ని తక్కువ ఖర్చుతోనే సన్ రే ఆసుపత్రి వైద్యులు అందించారు. 20 సంవత్సరాల అనూష గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ సన్ రే ఆస్పత్రి వైద్యులు డాక్టర్ సురేంద్రబాబును సంప్రదించారు. ఆమెకు త్రాంబో లైసిస్ చికిత్స అవసరమయింది. నిరుపేద కుటుంబానికి చెందిన ఆ యువతికి తక్కువ ఖర్చుతో వైద్యం అందించేందుకు వైద్యులు ముందుకొచ్చారు. అనంతపురం జిల్లాలో ప్రప్రథమంగా చికిత్స అందించడం సంతోషకరంగా ఉందని వైద్యులు సురేంద్రబాబు, రోహిత్‌రెడ్డి తెలిపారు. వారు మాట్లాడుతూ డయాలసిస్ పేషెంట్ అనూష తమను ఆశ్రయించిందన్నారు. ఎవి ఫిస్టులా రెండు గంటల నుంచి పనిచేయడం లేదని తెలుసుకుని నిర్ధారణ పరీక్షల ద్వారా రక్తం గడ్డకట్టినట్లు గుర్తించామన్నారు. వెంటనే గడ్డకట్టిన రక్తాన్ని కదిలించేందుకు ఉన్న అవకాశాలను వివరించామన్నారు. ఆమె కుటుంబ సభ్యుల అంగీకారంతో త్రాంబో లైసిస్ అనే పద్ధతి ద్వారా మార్క్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కిరణ్ కుమార్ సహకారంతో నాలుగు గంటల్లో ఫిస్టులా తిరిగి పనిచేసే విధంగా చికిత్స అందించామని వెల్లడించారు. అనూషకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ అవసరం ఉందన్నారు. కిడ్నీ మార్పిడి అనంతరం ఆమె సుఖమయ జీవితం గడపవచ్చునని తెలియజేశారు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా లబ్ధి చేకూర్చేందుకు దరఖాస్తు చేసినట్టు తెలిపారు. డయాలసిస్ రోగులు ఎవి ఫిస్టులా రోజులో కనీసం మూడు నుంచి నాలుగు సార్లు పనిచేస్తుందా లేదా అని పరీక్షించుకోవాలని తెలిపారు. ఒకవేళ పనిచేయని పక్షంలో వైద్యులను సంప్రదించాలన్నారు. ఈ సమావేశంలో ఆస్పత్రి మేనేజర్ వేణు, మార్కెటింగ్ మేనేజర్ విశ్వ, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.










