అనంతపురం ప్రతినిధి : పెట్టుబడిదారి వ్యవస్థ సంక్షోభాల మయమని నాడు కారల్ మార్క్స్ చెప్పారని, అదే నేడు రుజువు అవుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. కారల్‌మార్క్స్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం అనంతపురం నగరంలోని ఎన్జీవో హోంలో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 'ప్రపంచ ఆర్థిక మాంద్యం-ప్రజలపై ప్రభావాలు' అన్న అంశంపై సదస్సు నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బాలరంగయ్య అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ముఖ్య అతిథిగా వి.శ్రీనివాసరావు పాల్గొని ప్రసంగించారు. కమ్యూనిజానికి కాలం చెల్లింది... కాలంతోపాటు మారాలి అని చెప్పే వారికి ఇప్పుడు పరిస్థితులు ఎవరు మారాలన్నది స్పష్టం చేస్తున్నాయని గుర్తుచేశారు. మారాల్సింది కమ్యూనిస్టులు కాదు... పెట్టుబడిమద్దతుదారులన్నది స్పష్టమవుతోందని చెప్పారు. నేడు పెట్టుబడిదారీ వ్యవస్థ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది తెలిపారు. ప్రపంచం ఆర్థిక వ్యవస్థలో కీలకంగా చెలామణి అవుతున్న డాలర్ విలువనే ఇప్పుడు రోజురోజుకూ పడిపోతోందని వివరించారు. దీన్ని కాపాడుకోలేని స్థితిలోకి అమెరికా వెలుతోందన్నారు. రెండు వందల సంవత్సరాల క్రితమే కారల్ మార్క్సు ఈ సమాజలోని అంతరాలు, బాధలకుగల కారణాలను పరిశోధించి తర్కించి సమాజంలోని అంతర్గత సూత్రాన్ని గ్రహించి సమాజ గమనానికి మూల కారణం శ్రమ అని తెలియజేసారని గుర్తుచేశారు. ఈ శ్రమ ద్వారానే సంపద సృష్టించబడుతోందని చెప్పారు. అయితే ఇది కొద్ది మంది పెట్టుబడిదారీ చేతుల్లోకే వెలుతోందన్నారు. దీనికి మద్దతుగా పాలకులు ఉంటున్నారని పేర్కొన్నారు. ఈ దోపిడీకి వ్యతిరేకంగా శ్రమజీవులు ఏకమై పోరాడినప్పుడే సమసమాజ స్థాపన జరుగుతుందని వివరించారు. కారల్‌మార్స్ చెప్పిన ఈ సూత్రానికి అనుగుణంగా ప్రజలను సమైక్యపరచి దోపిడీకి, పీడనకు వ్యతిరేకంగా ప్రజలను సన్నద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ మాట్లాడుతూ నేడు ప్రపంచాన్ని సంక్షోభం పట్టి పీడిస్తోందని చెప్పారు. ఇది కమ్యూనిస్టులు చెబుతున్న మాటకాదని, ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్, ఐక్య రాజ్యసమితి వంటి సంస్థలే చెబుతున్నాయని గుర్తు చేశారు. ప్రపంచ ఆర్థికాభివృద్ధియే స్తంభించిపోతుందని ఆయా సంస్థలే ప్రకటిస్తున్నాయని తెలిపారు. 2023 అక్టోబరు నాటికి ప్రపంచ ఆర్థిక సంక్షోభం తారా స్థాయికి చేరుతుందని ప్రపంచ బ్యాంకు అధ్యక్షులే ఇటీవల ప్రకటించారని చెప్పారు. ప్రపంచంలో సుమారు 70 దేశాల్లో ఇది మరింత తీవ్రంగా ఉండే అవకాశముందని ఆర్థిక నిపుణులు సైతం అంచనా వేస్తున్నారన్నారు. ఈ సంక్షోభాలతో ఉపాధి మరింత మందిగించడమే కాకుండా ఉన్న ఉపాధిని కోల్పోయే పరిస్థితులు నెలకొంటాయన్న అంచనాలు వేస్తున్నారన్నారు. దేశంలో సుమారు నాలుగు కోట్ల మంది నిరుద్యోగులవుతారన్న కూడా చెబుతున్నారన్నారు. ఇంతటి తీవ్రమైన సంక్షోభాలకు కారణం ఆర్థిక వ్యవస్థలోనున్న లోపాలే కారణమని చెప్పారు. ఇదే విషయాన్నే నాడు మార్క్స్ తన సిద్ధాంతం ద్వారా తెలియజేసారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక నాయకులు ఎస్‌ఎం.బాషా, చంద్రశేఖర్, రిటైర్డు డిఆర్‌ఒ గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.










