28 శాతం జీఎస్టీ ఎఫెక్ట్
సంక్షోభంలో 'గ్రానైట్'
సగానికి పడిపోయిన కొనుగోళ్లు
ప్రజాశక్తి - చిత్తూరు ప్రతినిధి
'గ్రానైట్' పరిశ్రమల్లో సంక్షోభం నెలకొంది. మోడీ సర్కార్ 28 శాతం జీఎస్టీ ఎఫెక్ట్ కొనుగోళ్లు సగానికి పైగా పడిపోయాయి. గతంలో గ్రానైట్‌తో ఇళ్లు కట్టుకోడానికి ఎక్కువగా మక్కువ చూపేవారు. అయితే జీఎస్టీ కలిపి గ్రానైట్ కొనుగోలు చేయాలంటే మూడింతలు ఖర్చు తడిచి మోపెడవుతుండడంతో వినియోగదారులు వెనకడుగు వేస్తున్నారు. ఈ ప్రభావం ఉత్పత్తి పైనా పడుతోంది. సగానికి సగం అలాగే మిగిలిపోతోంది.
అరకొరగా సాగుతున్న వ్యాపారాలతో బ్యాంకుల వడ్డీ, రుణకంతులు కట్టలేక, విద్యుత్తు చార్జీలు చెల్లించలేక పరిశ్రమల నిర్వాహకులు అల్లాడుతున్నారు. వ్యాపారాలు లేకపోవడంతో ఈ రంగంలోని కూలీలకు వారంలో సగం రోజులు కూడా పనులు దొరకడం గగనంగా ఉంది.
గ్రానైట్ వ్యాపారం రాష్ట్రంలో చిత్తూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో విస్తారంగా సాగుతోంది. ప్రతి ఏడాదీ ఇందులో కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. ఇంటిని నిర్మించుకునేవారు ఫ్లోర్‌కు గ్రానైట్ వాడకం క్రమంగా పెరుగుతుంది. ఒక్క చిత్తూరు జిల్లాలోనే 600 పైగా పరిశ్రమలు ఉన్నాయని అంచనా. క్వారీ దగ్గర నుంచి గ్రానైట్ పరిశ్రమ వరకు ఈ వ్యాపారం జోరుగా సాగేది.
2017, జూలై నుంచి గ్రానైట్ పైన కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించింది. 14.5శాతం ఇదివరకు పన్ను ఉండేది. దీనిని 28 శాతానికి పెంచింది. గ్రానైట్ కొనుగోలు చేసే వినియోగదారులు దీన్ని కచ్చితంగా చెల్లించాల్సిందే. అంటే 1000 చదరపు అడుగుల్లో ఇంటిని నిర్మించుకునే వ్యక్తికి వెయ్యి అడుగుల గ్రానైట్ పాలిష్ బండలు కావాల్సి వస్తుంది. ఒక అడుగుకు తక్కువ అంటే 60 రూపాయలు పడుతుంది. వెయ్యి అడుగులకు 60వేలు అవుతుంది. జిఎస్టి 28శాతం, రవాణా, హమాలీ చార్జీలు అన్నీ కలిపి 16,800 పైగా ఖర్చు అవుతుంది. అన్నీ కలిపి లక్ష రూపాయలు వెచ్చించాలి. గతంలో 80వేల రూపాయల తోనే పని అయిపోయేది. అంతేకాకుండా గతంలో 8వేలు మాత్రమే పన్ను ఉండేది. ఇప్పుడు రెండింతలు కట్టాల్సి వస్తోంది. దీంతో గ్రానైట్ వైపు వినియోగదారులు మొగ్గు చూపించడం లేదు. సగం మంది పన్ను భారానికి భయపడి కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు.
గ్రానైట్ ఫ్యాక్టరీలు ఒక్కొక్కటి నెలకి సరాసరి 6వేల అడుగులు బండలుగా మార్చి అమ్ముతుంటారు. ఆరు అడుగుల రాయి అమ్మితే 3 లక్షల 60వేలు అవుతుంది. దీనికి జిఎస్టి 28 శాతం వేస్తే 1.10 లక్షలు వినియోగదారులు చెల్లించాలి. రాష్ట్రంలో రెండువేల ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ లెక్కన ఒక్క ఫ్యాక్టరీలో లక్షా 10వేల లెక్కన 22 కోట్ల రూపాయలు వినియోగదారులపై భారం పడుతుంది. ఇంత పెద్ద మొత్తం ప్రతినెలా కొనుగోలుదారులు భరించాల్సి వస్తోంది.
పడిపోయిన వ్యాపారాలు
28శాతం జిఎస్టి చెల్లించలేక వినియోగదారులు గ్రానైట్ను కొనుగోలు చేయడం తగ్గించేశారు. ఒక్కో పరిశ్రమలో సగానికి సగం వ్యాపారాలు పడిపోయాయి. పరిశ్రమ స్థాపించాలంటే కనీసం కోటి రూపాయలు పెట్టుబడి పెట్టాలి బ్యాంకులకు రుణకంతులు వాటికి వడ్డీలు కట్టుకుంటూ కరెంటు చార్జీలు కూలీలకు జీతాలు వంటివి వాటిని ఫ్యాక్టరీలు భరించాల్సి వస్తుంది. వ్యాపారాలు లేకపోవడం వల్ల వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది. నిర్వహణ ఖర్చులు తడిచి మోపెడయ్యాయి. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి షోరూమ్ నిర్వాహకులు వారంలో రెండుసార్లు వచ్చి గ్రానైట్ పాలిష్ బండలను తీసుకుపోయేవారు. ఆయా ప్రాంతంలో వీరు అమ్మేవారు. జీఎస్టీ వల్ల కొనుగోలు మొత్తం ఆగిపోయాయి. దీంతో వీరు పది రోజులకు ఒకసారి కూడా రావడం లేదని పరిశ్రమ యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఒక్కో ఫ్యాక్టరీలో సగానికి పైగా సరుకు నిలబడి పోతోంది. ఈ భారాన్ని భరించలేక కొంత మంది ఫ్యాక్టరీలను మూసేస్తున్నారు. మరి కొందరు మార్వాడీలకు లీజుకు ఇచ్చేస్తున్నారు.










