May 17,2023 21:11


ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు
ప్రజాశక్తి - నరసాపురంటౌన్‌
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను సద్వినియోగం చేసుకొని మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు తెలిపారు. బుధవారం స్థానిక అల్లూరి కళ్యాణ మండపంలో జరిగిన జిల్లా స్థాయి మత్స్యకార భరోసా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజుతో కలిసి జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి మాట్లాడుతూ మత్స్యకారులకు ఆర్థిక భరోసాను కలుగజేసే విధంగా వేట నిషేధ కాలంలో మత్స్యకార భరోసా సాయాన్ని ప్రభుత్వం అందజేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 1,635 మంది లబ్ధిదారులకు ఒక్కరికి 10 వేల రూపాయల చొప్పున 1.63 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి విడుదల చేసినట్లు తలెఇపారు. మొగల్తూరు మండలంలో 690 మంది, నరసాపురం మండలంలో 945 మంది లబ్ధిదారులు ఉన్నట్లు తెలిపారు. ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు వెన్నుదన్నుగా నిలవాలనే లక్ష్యంతో వివిధ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతోందన్నారు. నరసాపురం, మొగల్తూరు మండలాల్లో విస్తరించి ఉన్న సముద్ర తీర ప్రాంతంలో 3,500 వరకూ మత్స్యకార కుటుంబాలు ఉన్నాయన్నారు. వారిలో 1,635 మంది లబ్ధిదారులకు నేడు మత్స్యకార భరోసా జమ చేసినట్లు తెలిపారు. అనంతరం పొన్నపల్లి ఏటిగట్టు పనులు పరిశీలించారు. కార్యక్రమంలో ఎంబిసి ఛైర్మన్‌ పెండ్ర వీరన్న, సబ్‌ కలెక్టర్‌ ఎం.సూర్యతేజ, డిప్యూటీ ట్రెయినీ కలెక్టర్‌ దేవరకొండ అఖిల, మత్స్యశాఖ జెడి ఆర్‌జివిఎస్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.