
* కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
ప్రజాశక్తి - శ్రీకాకుళం : జిల్లాలో సంకేత భాషలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవం సందర్భంగా జిల్లా డెఫ్ అసోసియేషన్ ఆధ్వర్యాన నగరంలోని డేఅండ్‌నైట్ కూడలి నుంచి బాపూజీ కళామందిర్ వరకు గురువారం నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంకేత భాషలపై అవగాహన పెంపొందించేందుకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరిలో ప్రతిభ ఉంటుందని, వికలాంగుల్లో మరింత ఎక్కువగా ఉంటుందన్నారు. అటువంటి ప్రతిభను వెలికితీసి ప్రజలకు చాటిచెప్పడమే దీని ముఖ్య ఉద్దేశమన్నారు. ర్యాలీలో నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు, తహశీల్దార్ కె.వెంకటరావు, వికలాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు కవిత, డెఫ్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.