Nov 02,2022 21:19

సంఘాలు ఆర్థిక ప్రణాళికలతో
పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి: డీఆర్డీఏ పీడీ
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
స్వయం సహాయక సంఘాలు ఆర్థిక ప్రణాళికలను పాటిస్తే ఆర్థిక పురోభివద్ధికి సాధించవచ్చునని జిల్లా గ్రామీణాభివద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ డిఎంకె తులసి తెలిపారు. మంగళవారం చిత్తూరులోని బివి.రెడ్డి కాలనీలో గల ఇండియన్‌ బ్యాంక్‌ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంలో స్వయం సహాయక సంఘాలకు గత ఆరురోజులుగా జరుగుతున్న శిక్షణా కార్యక్రమం ముగింపు సందర్భంగా డీఆర్డీఏ పిడి తులసి మాట్లాడుతూ ఆర్థికపరమైన అంశాలు ఏవైనా మంచి పురోభివద్ధిని ఆర్థిక పరిపుష్టిని సాధించాలంటే పొదుపు, తెలివిగా ఖర్చు చేయడం, పరిపక్వ రుణాలు తీసుకోవడం, ఇన్సూరెన్స్‌ అండ్‌ పెన్షన్‌, ఆర్థిక క్రమశిక్షణతోపాటు ప్రణాళికలు అవసరమని చెప్పారు. సులభమైన జీవనోపాధి సాధించాలంటే పొదుపులతోపాటు ఆదాయం పెరిగే మార్గాలను కూడా ప్రణాళికా బద్ధంగా ఎంచుకోవాలన్నారు. అప్పుడే మంచి ఫలితాలను సాధించవచ్చు అన్నారు. ముందస్తు ప్రణాళికలు మార్కెటింగ్‌, డిమాండ్‌ తదితర అన్నిఅంశాలను పరిగణనలోకి తీసుకుని వ్యాపారరంగాలపై అడుగులు వేయాలన్నారు. డిజిటల్‌ లావాదేవీలు వలన సంఘం ద్వారా సభ్యులు పొందే రుణాలు, చెల్లింపులు పారదర్శకంగా ఉంటాయని వివరించారు. సంఘాల ద్వారా తీసుకున్న రుణాలను సకాలంలో చెలిస్తే భవిష్యత్తులో మరింత ప్రయోజనం పొందే అవకాశముందని ఈ విషయాన్ని సంఘ సభ్యులు గుర్తించు కోవాలన్నారు. ఈ ట్రైనింగ్‌లో శిక్షణ పొందిన సభ్యులు గ్రామసంఘం సభ్యులకు అందరికీ అవగాహన కల్పించాలన్నారు. ఆర్థిక అక్షరాస్యతపై సంపూర్ణ అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన సభ్యులకు సర్టిఫికెట్లను, శిక్షణకు సంబంధించిన కిట్టులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎల్డీఎం శేషగిరిరావు, ఇండియన్‌ బ్యాంక్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ మేనేజర్‌ శ్రీనివాసన్‌, డిపిఎం బ్యాంకు లింకేజ్‌ నాగేశ్వరరావు పాల్గొన్నారు.