ప్రజాశక్తి-ఉరవకొండ జిల్లా విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 23 నుంచి 30వ తేదీ వరకూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో చేపట్టిన సంగ్రామ సైకిల్ యాత్రను జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి సిద్ధార్థ పిలుపునిచ్చారు. ఈమేరకు శనివారం ఉరవకొండలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థి సంగ్రామ సైకిల్ యాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. వాటి పరిష్కారానికి ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సైకిల్ యాత్రను నిర్వహిస్తోందన్నారు. ఈ యాత్ర ఆగస్టు 23వ తేదీ తాడిపత్రిలో ప్రారంభమై గుత్తి, గుంతకల్లు, వజ్రకరూరు, ఉరవకొండ, కణేకల్, రాయదుర్గం, కళ్యాణదుర్గం మీదుగా ఈనెల 30న అనంతపురం చేరుకుంటుందన్నారు. ప్రధానంగా జిల్లాలోని సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి తొమ్మిదేళ్లు పూర్తవుతున్నా కనీసం ప్రహరీ నిర్మాణం కూడా పూర్తి చేయలేదన్నారు. అలాగే సంక్షేమ హాస్టల్లో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. భవనాలకు పెచ్చులు ఊడిపోయి శిథిలావస్థకు చేరినా పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలను ఇవ్వడం లేదన్నారు. శింగనమల, ఉరవకొండ, తాడిపత్రి, ఆత్మకూరు, గుత్తి జూనియర్ కళాశాలలో సరైన సదుపాయాలు లేవన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలకు సంబంధించి అనుబంధ హాస్టళ్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఇకపోతే జిల్లావ్యాప్తంగా నారాయణ, చైతన్య, ప్రయివేటు విద్యాసంస్థల్లో ఫీజులు అడ్డగోలుగా పెంచి వసూలు చేస్తుంటే ఇప్పటి వరకూ చర్యలు తీసుకున్న పాపానపోలేదన్నారు. ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించాలని చేపట్టనున్న సైకిల్‌యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ ఉరవకొండ మండల నాయకులు సింహాద్రి, లింగేష్, మహేష్, బన్ని, తదితరులు పాల్గొన్నారు.
సైకిల్ యాత్ర పోస్టర్లను విడుదల చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు










