Apr 11,2023 21:50

కలెక్టరేట్‌కు ర్యాలీగా వస్తున్న ఆశా కార్యకర్తలు

       అనంతపురం కలెక్టరేట్‌ : అపరిష్కృతంగా ఉన్న ఆశాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్స్‌ యూనియన్‌, సిఐటియు సంయుక్త ఆధ్వర్యంలో అనంతపురం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకుమునుపు గుత్తి రోడ్డు సర్కిల్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్‌ గేటు ఎదుట బైటాయించి నిరసన తెలిపారు. ఆశా వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షురాలు మాలతి అధ్యక్షతన నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి కౌలురైతు సంఘం జిల్లా కార్యదర్శి బాల రంగయ్య హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆశా యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగమణి మాట్లాడుతూ ఆశాల పట్ల వైద్యశాఖ సిబ్బంది వేధింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. ఎంఎల్‌హెచ్‌పిలు, సచివాలయం ఎఎన్‌ఎంలు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. తమ పరిధిలో ఉండాలంటే తమ పరిధిలో ఉండాలని ఎంఎల్‌హెచ్‌పిలు, సచివాలయ సిబ్బంది ఆశాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. ఆశలకు సంబంధం లేని పనులను పిహెచ్‌సిలు, సబ్‌ సెంటర్లలో చేయిస్తున్నారని చెప్పారు. ఇన్ని పనులు చేస్తున్నా వారి సమస్యల పరిష్కారంలో మాత్రం ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోందన్నారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని సెలవులూ వర్తింపజేయాలని కోరారు. అధికారులు, రాజకీయ నాయకుల వేధింపులను నియంత్రించాలని కోరారు. కౌలు రైతుసంఘం జిల్లా కార్యదర్శి బాలరంగయ్య మాట్లాడుతూ గ్రామాల్లో ఆశా కార్యకర్తలకు ప్రజలకు వివిధ రకాల సేవలు అందిస్తున్నారని చెప్పారు. ఇంతటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న వారికి ప్రభుత్వం కనీస వేతనాలు అమలు చేయకపోవడం దుర్మార్గం అన్నారు. ఆశాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయడం లేదన్నారు. వేతనాలు అరకొరగా ఇస్తూ, పథకాల్లో కోతలు పెట్టడం సరికాదన్నారు. ప్రభుత్వ పథకాలు వర్తింపజేయనందున వారికి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రామాంజినేయులు, నగర కార్యదర్శి వెంకటనారాయణ మాట్లాడుతూ ఆశాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. ఒంటరి మహిళలు వితంతువులకు వస్తున్న పెన్షన్‌లను ఆశాలకు ఇవ్వాలన్నారు. అనారోగ్యంతో మృతి చెందే ఆశాలకు గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలన్నారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలన్నారు. ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు మాలతి మాట్లాడుతూ ఆశలందరికీ స్మార్ట్‌ ఫోన్లు ఇచ్చారని, అందులో 10 శాతం ఫోన్లు కూడా పని చేయడం లేదన్నారు. నాణ్యమైన సెల్‌ ఫోన్‌లు ఇచ్చి 4జి సిమ్‌లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కలెక్టరేట్‌ అధికారులకు సమస్యలతో కూడిన వినిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎండిఎం జిల్లా అధ్యక్షులు జయమ్మ, ఆశ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు వరలక్ష్మి, భారతి, జరీనా, మల్లిక, నాగమణి, ప్రేమ తదితరులు పాల్గొన్నారు.