సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు
జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: రాజీ చేసుకోదగిన క్రిమినల్, సివిల్ కేసులన్ని కూడా జాతీయ లోక్‌అదాలత్‌లో సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవచ్చునని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ అధ్యక్షులు ఇ.భీమారావు తెలిపారు. శనివారం ఉదయం చిత్తూరు పట్టణం ఎస్టేట్‌లోని జిల్లాకోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్‌అదాలత్ కేసులు పరిస్కారం కార్యక్రమంలో ఆరవ అదనపు జిల్లా జడ్జి ఎన్.శాంతి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్‌జడ్జి డాక్టర్ ఐ.కరుణ కుమార్, బార్ అసోసియేషన్ కార్యదర్శి సి.భానుశేఖర్‌రెడ్డి, అదనపు ఎస్పీ శ్రీనివాసరావులతో కలసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ భారత సుప్రీంకోర్టు న్యాయ సేవ అధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవఅధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లాలో జాతీయ లోక్‌అదాలత్‌ను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మన దేశంలో కుటుంబ వ్యవస్థకు ఎంతో ప్రాధాన్యత కలదని ఏ బంధానికైనా నమ్మకమే ప్రధానమని, చిన్నచిన్న గొడవలను ఓర్పుతో పరిష్కరించుకోవాలే తప్ప కోర్టు వరకు రాకుండా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ మరియు మండల న్యాయ సేవ అధికార సంస్థ వద్ద పరిష్కరించుకోవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ ఐ.కరుణ కుమార్ మాట్లాడుతూ లోక్‌అదాలత్‌లో పాల్గొనున్న కక్షిదారులు ఆవేశాన్ని పక్కనపెట్టి రాజీ ప్రయత్నం చేసుకోవాలన్నారు. లోక్ అదాలత్‌లో ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు తీర్పుతో సమానమని తెలిపారు. లోక్ అదాలత్ లో కేసులు పరిస్కారించుకోవడం వల్ల సమయం, డబ్బు ఆదావుతుందన్నారు. జాతీయ లోక్‌అదాలత్ సందర్భంగా జిల్లాలోని 13 మండల కేంద్రాలలో 37 బెంచీలు, చిత్తూరు జిల్లా కోర్టు ఆవరణలో 7 బెంచీలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం కోర్టు ఆవరణలో ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖ, వైద్య ఆరోగ్యశాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి పరిశీలించారు. లోక్‌అదాలత్ కార్యక్రమంలో పాల్గొన్న కక్షిదారులకు భోజన సౌకర్యం కల్పించడం జరిగిందని తెలిపారు. న్యాయవాదులు, డీఎస్పీలు, కోర్టు సిబ్బంది, వివిధ బ్యాంకుల అధికారులు, బీమా, చిట్ ఫండ్ సంస్థలు అధికారులు, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు.










