Apr 11,2023 21:53

పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్‌

        పెద్దపప్పూరు : సమస్యలను వింటూ.. వారి వినతులను స్వీకరిస్తూ.. భవిష్యత్తుపై భరోసాను ఇస్తూ నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర కొనసాగింది. అనంతపురం జిల్లాలో జరుగుతున్న లోకేష్‌ యువగళం పాదయాత్ర మంగళవారం 67వ రోజుకు చేరుకుంది. శింగనమల నియోజకవర్గం నుంచి తాడిపత్రి నియోజకవర్గంలోకి యాత్ర ప్రవేశించింది. పెద్దపప్పూరు మండల పరిధిలోని సింగన్నగుట్టపల్లి గ్రామం నుంచి మైదలైన యాత్ర చాగల్లు, తబ్జూలు, పెద్దపప్పూరు, చిన్నపప్పూరు, గార్లదిన్నె, పసూలూరు గ్రామాల మీదుగా కొనసాగింది. పసులూరులో రాత్రికి బస చేశారు. చాగల్లు వద్ద భూ నిర్వాసితులు, బెస్త కులస్తులతో సమావేశం అయ్యారు. పెద్దపప్పూరులో దూదేకులు, బుడుగ జంగాలు, చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు. తాడిపత్రి నియోజకవర్గంలోని యాత్ర చేరుకోగానే టిడిపి శ్రేణులు ఘనస్వాగతం పలికారు. రోడ్డుకు ఇరువైపులా పసుపు జెండాలు బెలూన్లతో అలంకరించారు. మాజీ ఎమ్మెల్యే జెసి.ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు జెసి.అస్మిత్‌రెడ్డి ఆధ్వర్యంలో లోకేష్‌కు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు.
సమస్యలు వింటూ... వినతిపత్రాలు స్వీకరిస్తూ...
పెద్దపప్పూరు మండలంలో లోకేష్‌ పాదయాత్ర వివిధ వర్గాల వారితో సమావేశం అయ్యి, వారి సమస్యలను వింటూ, వినతిపత్రాలు స్వీకరిస్తూ సాగింది. సింగన్నగుట్టపల్లి గ్రామంలో చాగల్లు ప్రాజెక్టు కింద భూమలు కోల్పోయిన వారు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ రాలేదని, టిడిపి హయాంలో నిర్మించుకున్న ఇళ్లకు కూడా బిల్లులు ఇవ్వడం లేదని తమకు న్యాయం చేయాలని లోకేష్‌ను కోరారు. చాగల్లు ప్రాజెక్టు వద్ద చేపలు పట్టే బెస్తకులస్తులు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. 2010 సంవత్సరం నుంచి చాగల్లు ప్రాజెక్టులో చేపలు పట్టుకుని జీవన సాగిస్తుండే వాళ్లమని, వైసిపి ప్రభుత్వం వచ్చాక జీవో నెంబర్‌ 217ను తీసుకొచ్చి రిజర్వాయర్‌లో చేపలు పట్టుకునేందుకు వీల్లేకుండా చేశారన్నారు. జీవోను తొలగించి తమకు న్యాయం చేయాలని కోరారు. పెద్దపప్పూరు గ్రామ శివారులో దూదేకుల కులస్తులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా దూదేకుల కులస్తులు మాట్లాడుతూ తమ కులానికి సంబంధించి విద్యార్థులకు టీసీల్లో హిందూ దూదేకులు అని రాస్తున్నారని, దీనిని సవరించి ముస్లిం దూదేకులు అని రాసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలా చేయడం వల్ల ముస్లిములకు వర్తించే పథకాలూ తమకు వర్తిస్తాయని చెప్పారు. చట్టసభల్లో కూడా దూదేకులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరారు. పెద్దపప్పూరు రామకోటి కాలనీలో బుడుగజంగాలతో ముఖాముఖి నిర్వహించారు. చేనేత కార్మికులతోనూ సమావేశం అయ్యారు. టిడిపి అధికారంలోకి రాగానే యువగళం పాదయాత్రలో తన దృష్టికి తీసుకుని వచ్చిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని లోకేష్‌ హామీ ఇచ్చారు. ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. వైసిపి పాలనలో అన్ని వర్గాల ప్రజలూ ఇబ్బందలకు గురవుతున్నారని చెప్పారు. సంక్షేమాన్ని విస్మరించి పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024లో టిడిపి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని భవిష్యత్తు మనదే అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, జెసి.ప్రభాకర్‌రెడ్డి, జెసి.అస్మిత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, టిడిపి పెద్దపప్పూరు మండల నాయకులు రామకష్ణారెడ్డి, భాస్కర్‌ రెడ్డి, లోక్‌నాథ్‌, టిడిపి కన్వీనర్‌ రఘునాథ్‌ రెడ్డి, మైనార్టీ నాయకులు షెక్షావలి, భాస్కర్‌ రెడ్డి, హరినాథ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లోకేష్‌కు ఘన స్వాగతం
లోకేష్‌కు అడుగడుగునా టిడిపి శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. మాజీ ఎంపీ జెసి.దివాకర్‌రెడ్డి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జెసి.ప్రభాకర్‌ రెడ్డి, టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి జెసి.అస్మిత్‌ రెడ్డి పిలుపుమేరకు వేలాదిగా టిడిపి శ్రేణలు తరలొచ్చి లోకేష్‌కు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. యాత్ర సందర్భంగా టిడిపి కార్యకర్తలను మరింత ఉత్సాహపరిచేందుకు మాజీ ఎమ్మెల్యే జెసి.ప్రభాకర్‌ రెడ్డి ఓపెన్‌ టాప్‌ జీపుపై ఎక్కి డాన్స్‌ చేస్తూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు.