Jul 20,2023 09:03

స్థాయి సంఘ సమావేశంలో మాట్లాడుతున్న జెడ్పీ ఛైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ

          అనంతపురం : ఆయా శాఖల పరిధిలో ప్రజా సంబంధిత సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని జెడ్పీ ఛైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ అధికారులను ఆదేశించారు. అనంతపురం జిల్లా ప్రజా పరిషత్‌ కార్యాలయంలో బుధవారం ఉదయం స్థాయీ సంఘ సమావేశాలను నిర్వహించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజాపరిషత్‌ ఛైర్‌పర్సన్‌ గిరిజమ్మ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో వివిధ శాఖల పురోభివద్ధిపై సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు ప్రగతి నివేదికలు, వారిశాఖ ద్వారా జరుగుతున్న సంక్షేమ, అభివద్ధి కార్యక్రమాలను స్థాయీ సంఘ సభ్యులకు వివరించారు. స్థాయీ సంఘ సభ్యులు వారి సంబంధిత ప్రాదేశిక నియోజక వర్గం నందు గల సమస్యలను సభ దృష్టికి తీసుకురాగా వెంటనే వాటిని పరిష్కరించాలని జిల్లా ప్రజా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ సంబంధిత అధికారులను అదేశించారు. విద్యాశాఖలో నిర్లక్ష్యం తీరుపై ఛైర్మన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శెట్టూరు, కంబదూరు మండలాల్లో మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనపై వెంటనే విచారణ జరిపించి అందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి 104 సర్వీసులను అన్ని మండలాల్లోనూ అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్‌ కార్యాలయ ఆవరణలోని మహాత్మా జ్యోతిబాపూలే విగ్రహం పక్కన సావిత్రిబాయి పూలే విగ్రహం ఏర్పాటు చేసేలా సమావేశంలో తీర్మానం చేశారు. ఈ సమావేశాలలో జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి కె.భాస్కర్‌రెడ్డితో పాటు ఉమ్మడి జిల్లా పరిధిలోని స్థాయీ సంఘాల్లోని జెడ్పీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.