తణుకురూరల్:ప్రజా సమస్యల పరిష్కారంలో వైసిపి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సిపిఎం నాయకులు విమర్శించారు. మంగళవారం స్థానిక అమరవీరుల భవనంలో గుబ్బల గోపి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి పివి.ప్రతాప్ మాట్లాడుతూ పట్టణంలో జగనన్న ఇళ్ల నిర్మాణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల సమస్యలు నేటికీ పరిష్కరించలేదన్నారు. నాలుగేళ్లయినా నేటికీ టిడ్కో ఇళ్లు ఇవ్వకపోవడం సిగ్గు చేటన్నారు. ప్రభుత్వాసుపత్రిలో సమస్యలను ఎన్నోసార్లు విన్నవించినప్పటికీ పరిష్కారం చేయలేక పోయారన్నారు. కార్పొరేట్, ప్రయివేటు విద్యా సంస్థల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నా వాటిని ఆపలేక పోయారన్నారు. నేటికీ పాడైన రోడ్లు వేయలేదన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకూ సిపిఎం ప్రజల పక్షాన పోరాటం చేస్తుందన్నారు. సమావేశంలో సిపిఎం పట్టణ కమిటీ నాయకులు అడ్డగర్ల అజయకుమారి, కామన మునిస్వామి, పిడి.మూర్తి, పిఎల్ నర్సింహారావు పాల్గొన్నారు.










