Jul 16,2023 21:23

ప్రజాశక్తి - ఆచంట
పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ప్రజా నాయకుడు, వల్లూరు మాజీ సర్పంచి చిట్టూరి రామకృష్ణ ధన్యజీవి అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేతా గోపాలన్‌ అన్నారు. చిట్టూరి రామకృష్ణ 13వ వర్థంతి సందర్భంగా ఆదివారం వల్లూరు సెంటర్లోని చిట్టూరి రామకృష్ణ స్తూపం వద్ద సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో వర్థంతి సభ నిర్వహించారు. తొలుత రామకృష్ణ చిత్రపటానికి సిపిఎం సీనియర్‌ నాయకులు ఇందుకూరి సూర్యనారాయణ రాజు, తోటపల్లి సత్యన్నారాయణ చిట్టూరి రామకృష్ణ స్తూపం వద్ద కేతా గోపాలన్‌, రామకష్ణ కుమారుడు చిట్టూరి రాంబాబు, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్తూపం వద్ద సీనియర్‌ నాయకులు బొర్రా ధర్మారావు సిపిఎం పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జరిగిన సభలో కేతా గోపాలన్‌ మాట్లాడుతూ వల్లూరులో ఏ సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించడంలో రామకృష్ణ ముందుండేవారని తెలిపారు. గ్రామ సర్పంచిగా పనిచేసిన సమయంలో ఎటువంటి అవినీతి, బంధుప్రీతి లేకుండా నిష్కళంకంగా గ్రామ ప్రజలకు సేవలందించారని కొనియాడారు. 1986 వరదల్లోనూ, 1996 తుపాన్‌ సమయాల్లోనూ గ్రామస్తులందరినీ ఏకంచేసి తుపాన్‌ బాధితులకు అందించిన సేవలు మరువరానివని కీర్తించారు. రామకృష్ణ ఆశయ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై అలుపెరగకుండా పోరాడడమే వారికిచ్చే ఘననివాళి అని గోపాలన్‌ అన్నారు. కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు వద్దిపర్తి అంజిబాబు, ఎస్‌విఎన్‌ శర్మ, సిర్రా నర్సింహమూర్తి, నేదూరి హనుమంతరావు, వారణాసి పార్ధసారధి, పంది అప్పారావు, తాళం సుబ్బారావు, జవజాల దుర్గారావు, కమిడి ఉమామహేశ్వరరావు, బొర్రా నాగేశ్వరరావు పాల్గొన్నారు.