Jul 09,2023 20:38

రాష్ట్ర సదస్సుకు సంబంధించిన గోడపత్రికలను విడుదల చేస్తున్న రజక సంఘం నాయకులు

          ప్రజాశక్తి-పెద్దవడుగూరు   రజకుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించే సమయం ఆసన్నమైనదని, కలసికట్టుగా ఉద్యమాలకు తరలిరావాలని ఎపి రజక వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర నాయకుడు లింగమయ్య పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని గంగమ్మ ఆలయంలో ఏర్పాటు చేసిన రజక వృత్తిదారుల ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా రజక వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న రజకులకు ప్రభుత్వాలు ఆదుకోవడంలో విఫలమవుతున్నాయన్నారు. ప్రస్తుతం పెద్దవడుగూరులో రజకుల కోసం ఇచ్చిన ఇళ్ల స్థలాలను కొందరు ఆక్రమించేందుకు సన్నాహాలు చేస్తున్నారన్నారు. దీన్ని పూర్తిస్థాయిలో ఖండిస్తున్నామన్నారు. రజకులకు కేటాయించిన స్థలాలను ప్లాట్లుగా వేసి ఇళ్లనిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. గ్రామాల్లో రజకులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రత్యేక సామాజిక భద్రతా చట్టాన్ని తీసుకొచ్చి రక్షణ కల్పించాలని కోరారు. అనంతరం ఈనెల 21న నిర్వహించనున్న రజక వృత్తిదారుల సమాఖ్య రాష్ట్రసదస్సుకు సంబంధించిన గోడపత్రికలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం జిల్లా కార్యదర్శి నాగప్ప, మండల నాయకులు కుళాయిస్వామి, రామాంజనేయులు, మల్లికార్జున, సుంకన్న, పాపన్న, పుల్లయ్య, సుధాకర్‌, కార్తీక్‌, తిరుపాలు, ఈశ్వరమ్మ, రంగమ్మ, అంజలి, అంజి, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.