Oct 15,2023 22:28

ఫొటో : మాట్లాడుతున్న నాయకులు

సమస్యల పరిష్కారానికి పోరు
ప్రజాశక్తి-కావలి రూరల్‌ : గ్రామ, వార్డు సచివాలయ ఎనర్జీ అసిస్టెంట్‌ల సమస్యల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా తలపెట్ట దలచిన ఆందోళనకు సిద్ధం కావాలని గ్రామ, వార్డు సచివాలయం ఎనర్జీ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు రహీం, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి డి.అంకయ్య పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని క్లాత్‌ మార్కెట్‌ అసోసియేషన్‌ భవన్‌లో ఆ సంఘం కావలి డివిజన్‌ స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి అవినీతి రహితంగా, నేరుగా, త్వరతిగతిన ప్రజలకు సేవలందాలనే గొప్ప ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాల్లో 19శాఖల ఉద్యోగులను నియమించిందన్నారు.
రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఏకకాలంలో దాదాపు లక్షా 40 వేల ఉద్యోగాలు కల్పించి అందులో తమకు ఉద్యోగ అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. సచివాలయ ఉన్నతాధికారులు ఇందులో పనిచేస్తున్న 18 శాఖల ఉద్యోగుల పనితీరును పర్యవేక్షిస్తూ వారి సమస్యలను కూడా తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉందని తెలిపారు. అయితే ఒక్క ఎనర్జీ సెక్రటరీలను విస్మరించి వారి బతుకులను గాలిలో దీపాలుగా మార్చివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందరిలాగే సచివాలయ వ్యవస్థలో భాగంగా ఎనర్జీ అసిస్టెంట్‌ కూడా నియమింపబడ్డదని అందరికీ వర్తించే పనివేళలు, సెలవులు వర్తిస్తాయని అవేవి వర్తింపజేయకుండా విద్యుత్‌ సంస్థలు బ్రిటీష్‌ చట్టాలను అమలు చేస్తూ బానిసల కన్నా హీనంగా పని చేయిస్తున్నారని వాపోయారు. విద్యుత్‌ సంస్థలు సచివాలయ ఉద్యోగుల కన్నా ఏ ఒక్క రూపాయి కూడా అదనంగా ఎనర్జీ సెక్రటరీలకు చెల్లించడం లేదని వారన్నారు. వారి విధానాల ప్రకారం వారి ఉద్యోగులకు ఇచ్చే ఇతర అలవెన్సులు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అవి ఇవ్వకుండా వారి ఉద్యోగులు సకాలంలో ప్రజలకు సర్వీసును అందించకపోతే వేసే ఫైన్‌ తమకు వేస్తూ జీతాలలో కోతలు మాత్రం విధిస్తున్నారని వారు వాపోయారు. ఇప్పటికైనా సచివాలయ వ్యవస్థ తమను సచివాలయ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. కార్యక్రమానికి గ్రామ, వార్డు సచివాలయ ఎనర్జీ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర సమితి సభ్యులు అనిల్‌ కావలి డివిజన్‌ నాయకులు ఎస్‌.వెంకట్రావు, బి.కళ్యాణ్‌, పి.వెంకటేశ్వర్లు, శివకుమార్‌, అంకయ్య, రామలింగయ్య, తదితరులు నాయకత్వం వహించారు.