Oct 13,2023 22:29

ఫొటో : అర్జీలు స్వీకరిస్తున్న జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ కూర్మానాథ్‌

సమస్యల పరిష్కారానికి చర్యలు
ప్రజాశక్తి-జలదంకి : మండల స్థాయి స్పందన కార్యక్రమంలో గుర్తించిన రెవెన్యూ సమస్యలను గ్రామసభలు ఏర్పాటు చేసి పరిష్కరించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ కూర్మనాథ్‌ పేర్కొన్నారు. స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో శుక్రవారం ఆయన జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజల నుండి అందిన అర్జీలను సంబంధిత అధికారులకు ఇచ్చి నిర్ణీతకాల వ్యవధిలో పరిష్కరించాలని ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష కార్యక్రమం ద్వారా భూముల రీసర్వే చేపట్టినట్లు తెలిపారు.
గ్రామాల్లో మ్యూటేషన్లు, ఎఫ్‌ లైన్‌ సర్వే, వెబ్‌ ల్యాండ్‌లో లోటుపాట్లు సరిచేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. గ్రామస్థాయిలో ప్రజల సమస్యలు పరిష్కరించాలనే లక్ష్యంతో మండల కేంద్రాల్లో ముందుగానే షెడ్యూలు ప్రకటించి ప్రతి బుధవారం, శుక్రవారం జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రానికి రాలేని గ్రామాల ప్రజల సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించడం, సంతృప్తికర స్థాయిలో పరిష్కరించేందుకు మండల కేంద్రాల్లో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. జలదంకిలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. 126 అర్జీలను ప్రజలు అందజేశారని, నిర్ణీత గడువులోగా ఈ అర్జీలను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. 90శాతం అర్జీలు భూ సమస్యలపై అందాయని, ప్రధానంగా డీకేటి భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు, అసైన్డ్‌మెంట్‌ పట్టాలు, వన్‌బి, రెవెన్యూ రికార్డుల్లో తప్పులు, సాదాబైనామా మ్యూటేషన్లు మొదలైన అంశాలపై అర్జీలు అందాయన్నారు. జలదంకి, బ్రాహ్మణకాక, చిన్నక్రాక, గట్టుపల్లి గ్రామాల నుంచి ఎక్కువగా భూ సమస్యలపై అర్జీలు అందినట్లు తెలిపారు. గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి రెవెన్యూ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. అసైన్డ్‌మెంట్‌ పట్టాల మంజూరు కోసం 20వ తేదీ లోగా జాబితాను తయారుచేసి పంపాలని రెవెన్యూ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కావలి ఆర్‌డిఒ శీనానాయక్‌, జెడ్‌పి సిఇఒ బి.చిరంజీవి, ఎంపిడిఒ శ్రీధర్‌ బాబు, తహశీల్దార్‌ సిహెచ్‌ పద్మావతి, డిపిఒ సుస్మిత, డిఆర్‌డిఎ, డ్వామా, హౌసింగ్‌ పిడిలు సాంబశివారెడ్డి, వెంకట్రావు, నాగరాజు, సిపిఒ ఎఎస్‌ రాజు, సర్వే రికార్డుల ఎడి హనుమాన్‌ ప్రసాద్‌, జిల్లా రిజస్ట్రార్‌ బాలాంజనేయులు, ఆర్‌టిసి ఆర్‌ ఎం శేషయ్య, డిప్యూటీ కమిషనర్‌ లేబర్‌ వెంకటేశ్వర రావు, డిటిసి చందర్‌, డిఎస్‌ఒ వెంకటేశ్వర్లు, ఎస్‌ఇలు ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బి, విద్యుత్‌, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, సంక్షేమ అధికారులు పలువురు జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.