ప్రజాశక్తి - భీమవరం
స్పందనలో వచ్చిన ప్రతి సమస్యనూ సమర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టరు పి. ప్రశాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలు మూలల నుంచి వచ్చిన 153 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ స్పందనలో అందిన వినతుల పరిష్కారం అర్జీదారులకు సంతృప్తి కలిగించేలా ఉండాలన్నారు. అర్జీలు తిరిగి రీఓపెన్ అయ్యే అవకాశం లేకుండా శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ఒకే సమస్యపై రెండోసారి స్పందనలో ఫిర్యాదులు రాకుండా సమస్య పరిష్కారంలో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు. ప్రతి రోజూ స్పందనపై పది నిమిషాల సమయం కేటాయించినట్లయితే ఎప్పుడు సమ స్యలు అప్పుడే పరిష్కారం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింటు కలెక్టరు ఎస్.రామ్ సుందర్ రెడ్డి, డిఆర్‌ఒ కె.కష్ణవేణి, డిపిఓ జివి మల్లికార్జునరావు, డ్వామా పీడీ ఎస్‌టివి.రాజేశ్వరరావు పాల్గొన్నారు.
నరసాపురం టౌన్:స్పందనలో వచ్చిన ప్రతి ఫిర్యాదుపైనా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలని సబ్ కలెక్టరు ఎం.సూర్యతేజ ఆదేశించారు. సోమవారం నరసాపురం సబ్‌కలెక్టరు కార్యాలయం స్పందన సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి డివిజన్ నుండి వచ్చిన 64 ఫిర్యాదులను సబ్ కలెక్టర్ సూర్య తేజ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన అర్జీలను గడువులోగా పరిష్కరించే విధంగా మండల స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. స్పందనలో అందిన అర్జీలను రీఓపెన్ కాకుండా స్పష్టతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో భూ సమస్యలు, రేషన్ కార్డులు, పింఛన్లు, హౌసింగ్, భూమి తగాదాలు, మత్స్యశాఖ, వైద్య ఆరోగ్యశాఖ తదితర సమస్యలపై వినతులు అందాయి. కార్యక్రమంలో డివిజన్, మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరిస్తాం : ఎస్‌పి
భీమవరం రూరల్:ఫిర్యాదుదారుల సమ స్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ఎస్‌పి యు.రవిప్రకాష్ పోలీసు అధికారులు సూచించారు. సోమవారం స్థానిక డిఎస్‌పి కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 26 ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఫిర్యాదుదారులతో ఎస్‌పి స్వయంగా మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని వారికి భరోసా కల్పించారు. చీటింగ్‌పై 10, కట్నం కోసం వేధింపులపై 12, వేధింపులు 2, ఆస్తి తగాదాలు 2, రాగ ఫిర్యాదులను ఆయా పరిధిలోని స్టేషన్లకు రిఫర్ చేసి పరిష్కరించాలని ఆదేశించారు.










