అనంతపురం కలెక్టరేట్ : ఈనెల 8వ తేదీ రైతు దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కళ్యాణదుర్గంలో పర్యటించనున్నారని, దీనికోసం అన్ని శాఖలూ సమన్వయంతో పని చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఎమ్.గౌతమి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై ఆదివారం నాడు కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆ శాఖల పరిధిలో అధికారులకు అప్పగించిన విధులను సమిష్టిగా, సమర్థవంతంగా పనిచేయాలన్నారు. బహిరంగ సభ వద్ద గ్యాలరీల్లో సీటింగ్ ఏర్పాట్లు, శానిటేషన్ సక్రమంగా ఉండాలన్నారు. తాగునీరు అందరికీ అందేలా చూడాలన్నారు. విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. హెలీప్యాడ్, అక్కడి నుంచి బహిరంగ సభ వరకు బ్యారికేట్స్ ఏర్పాట్లపై ఆర్‌అండ్‌బి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసులు వాహనాల పార్కింగ్, హెలీప్యాడ్ వద్ద ఏర్పాట్లు, బందోబస్తుపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, అసిస్టెంట్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్, సబ్ కలెక్టర్ నిశాంత్ రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.










